
ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి విజయ్ ఆరోపించారు. సోమవారం నగరంలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవైపు డీఈ పకడ్బందీగా ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటిస్తుంటే మరోవైపు జిల్లా కో–ఆర్డినేటర్ మాత్రం మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్ సభ్యుడు ఉదయ్ పాల్గొన్నారు.
పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బత్తల అరుణ్ కోరారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పీజీ కామన్ సెట్ విధానాన్ని, జీఓ 77ను రద్దు చేయాలని కోరుతూ నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 77 తీసుకురావడం వళ్ల 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ జీఓను రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నగర నాయకులు ఈశ్వరరెడ్డి, నాగార్జున, గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీనియారిటీ జాబితాపై
అభ్యంతరాల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్ : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామని పాఠశాల విద్య ఆర్‌జేడీ శామ్యూల్ తెలిపారు. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు నోటీసు బోర్డులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment