ఉద్యోగాల పేరుతో మోసం
కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర ప్రభుత్వ సంస్థ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కడపకు చెందిన ఆది రవికుమార్‌పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ కోరారు. సోమవారం బాధితులతో కలిసి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కెరీర్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కో ఆర్డినేటర్ ఉద్యోగం పేరుతో జిల్లాలో చాలామంది వద్ద రూ. 4–6 లక్షలు చొప్పున వసూలు చేశాడని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్స్ అంటూ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు, ఆర్‌జేడీ, డీఈఓలకు సైతం ఫేక్ మెయిల్స్ పంపి వారిని సైతం మోసగించాడని తెలిపారు. ఈ విషయం వెల్లడి కావడంతో నిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. బాధితులంతా రవికుమార్ వద్దకు వెళ్లి తమ డబ్బులు తమకు చెల్లించాలని కోరగా, ఆయన స్పందించడం లేదన్నారు. అధికారులు కూడా ఉద్యోగాల్లో చేర్చుకునే ముందు అపాయింట్‌మెంట్ లెటర్లు నకిలీవా? నిజమైనవా? అంటూ నిర్ధారించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధితులకు డబ్బులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment