పింఛన్‌ పేరుతో వృద్ధురాలికి మోసం | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ పేరుతో వృద్ధురాలికి మోసం

Published Wed, Mar 5 2025 1:45 AM | Last Updated on Wed, Mar 5 2025 1:40 AM

పింఛన

పింఛన్‌ పేరుతో వృద్ధురాలికి మోసం

కడప అర్బన్‌ : కూటమి ప్రభుత్వం వచ్చింది. నీకు చెవుడుకు సంబంధించిన సర్టిఫికెట్‌తో పాటు పింఛన్‌ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఏకంగా వృద్ధురాలి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నిన టీడీపీ కార్యకర్త ఉదంతమిది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ కార్యకర్తపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేశారంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు షేక్‌ రహమత్‌బీ (62) తన సోదరుడు నబీరసూల్‌తో కలిసి కడప తాలూకా పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

కడప నగరంలోని నబీకోట మరాఠీవీధిలో షేక్‌ రహమత్‌బీ (62) నాలుగున్నర సెంట్ల స్థలంలో మూడు సెంట్ల మేరకు ఉన్న ఇంటిలో నివాసం ఉంటోంది. మిగిలిన ఒకటిన్నర సెంట్ల స్థలం ఖాళీగానే ఉంది. ఆమెకు చెవుడు ఉండటంతో చిలకలబావి మంచాలరామయ్య వీధికి చెందిన షేక్‌ సుల్తాన్‌ ఇమ్రానుద్దీన్‌ అనే టీడీపీ కార్యకర్త ఇంటిని, ఖాళీ స్థలాన్ని కాజేయాలని పథకం రచించాడు. అనుకున్నట్లుగానే రహమత్‌బీకి చవుడు ఉన్నట్లు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇప్పిస్తానని గత ఏడాది జూన్‌ 12వ తేదీన రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లి ఇల్లు, ఖాళీ స్థలం ఉన్న మొత్తం నాలుగున్నర సెంట్లను తన పేరుతో జీపీ (జనరల్‌ పవర్‌ అటార్నీ) చేయించుకున్నాడు. రెండవ సారి షేక్‌ రహమత్‌బీని వేలిముద్ర వేసి రావాలని రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు తీసుకుని వెళ్లాడు. తన తల్లి గులాబ్‌జాన్‌కు, రహమత్‌బీ ఒకటిన్నర సెంట్ల స్థలాన్ని విక్రయించినట్లుగా ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తన ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొతలు వేస్తుండటంతో అనుమానం వచ్చిన రహమత్‌బీ ఎందుకు కొలుస్తున్నారని ప్రశ్నించింది. తరువాత ప్రొద్దుటూరులో ఉంటున్న రహమత్‌బీ సోదరుడు నబీరసూల్‌, తన బంధువులతో కలిసి వచ్చి విచారించారు. రహమత్‌బీ భర్త షేక్‌ జమాల్‌కు తాను అన్న కుమారుడినని సదరు టీడీపీ కార్యకర్త జీపీ లో పొందుపరిచినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5న షేక్‌ ఇమ్రానుద్దీన్‌ పేరుమీద ఉన్న జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీ.పీ)ని రహమత్‌బీ, తన సోదరులతో కలిసి వెళ్లి రద్దు చేయించింది. కానీ ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం టీడీపీ కార్యకర్త ఇమ్రానుద్దీన్‌ తన తల్లి గులాబ్‌జాన్‌ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఉండటంతో రహమత్‌బీ తనకు న్యాయం చేయాలని ఫిబ్రవరి 24న ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఇమ్రానుద్దీన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేసి పిలిచారు. పలుమార్లు పిలిచినా రాకపోవడంతో కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఇమ్రానుద్దీన్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రానుద్దీన్‌ విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే రిమ్స్‌కు తరలించారు. వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఆమె స్థలాన్ని తన తల్లి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుందని కాదని సివిల్‌ తగాదాలో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇమ్రానుద్దీన్‌ విలేకరుల ఎదుట ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంఘటనపై కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని పిలిస్తే అతను రాకుండా ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు.

ఏకంగా ఆమె ఇంటిని, స్థలాన్ని

కాజేసేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్త

చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేశారంటూ

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
పింఛన్‌ పేరుతో వృద్ధురాలికి మోసం 1
1/1

పింఛన్‌ పేరుతో వృద్ధురాలికి మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement