
గుణాత్మక విద్యనందించడమే లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జీవో 117 ఉపసంహరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సన్నాహక మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ, నివేధికల సమర్పణ తదితర అంశాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 117ను ఉపసంహరించిన తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించిందన్నారు. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాలల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, పలువురు మేధావులతో అధ్యయనం జరిగిందన్నారు. కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదించారు. జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహణలోకి వస్తాయని.. ప్రాథమిక పాఠశాలల తరగతులు మారుతాయే తప్ప ఆ పాఠశాలలను మూసివేసే ప్రసక్తే ఉండదన్నారు. ఈ అంశాన్ని గుర్తుంచుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తిస్థాయి వివరణలు ఇవ్వాలన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీలు, మండల సమాఖ్య సభ్యులతో కూలంకుశంగా మాట్లాడితేనే సరైన నిర్ణయాలు బయటకు వస్తాయన్నారు. విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందేంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించే యోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
సంతృప్త స్థాయిలో ఆరోగ్య సేవలు అందించండి
గ్రామ,పట్టణ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సంతృప్త స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేటో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రులు, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిదీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓపీ, ఐపీ,ల్యాబ్ టెస్ట్లు, డెలివరీ వంటి ఆరోగ్య సేవలలో అ గ్రేడ్ సాధించి.. రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పర్ఫామెన్స్ ఇండికేటర్స్ లో మంచి ప్రతిభ చూపిన వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నాగరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ బాలంజనేయులు,డీసీహెచ్‌ఎస్ ఇన్చార్జి కరిముల్ల , కడప డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఉమా మహేశ్వర రావు, బద్వేల్ డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మల్లేష్,పులివెందుల డిప్యూటీ ఖాజా మొయినుద్దీన్, జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శివ ప్రసాద్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్స్, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment