కూలిన బతుకులు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రోజూ కూలి పనికి వెళ్తేనే.. నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. వారి కుటుంబ జీవనం గడుస్తుంది. అలాంటి వారిపై విధి చిన్న చూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని బలి తీసుకుంది. ఏడుగురిని ఆస్పత్రి పాలు చేసింది. వారిని నమ్ముకున్న కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఎంత పని చేశావు దేవుడా’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక తాము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ.. శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాయి గని పనులకు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలంకూరు గ్రామంలోని కొందరు కూలీలు.. నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనిలోకి పనికి వెళ్తుంటారు. అందులో భాగంగా గురువారం తెల్లవారుజామున చిలంకూరు నుంచి నిడుజివ్వి గ్రామానికి ట్రాక్టర్‌లో తొమ్మిది మంది కూలీలు బయలుదేరారు. ట్రాక్టర్ గ్రామం దాటింది అంతే.. పూణే నుంచి మద్రాసు వెళ్లే లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న తొమ్మిది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు
గ్రామ సమీపంలోనే ప్రమాదం జరగడంతో.. వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముత్తరాసుగారి లక్షుమ్మ (56), నత్తి గంగులరాగారి వెంకటాంజనేయులు (52) ఆసుపత్రికి చేరుకున్న వెంటనే మృతి చెందారు. మల్లేల రోశయ్య, ఎట్టిచిన్న ఓబన్న, పోలుగారి గురప్ప, పొన్నా వెంకటసుబ్బయ్య, గంగాదాం పల్లి హరినాఽథ్, కేజీ ఓబయ్య, మాలపాటి బాలస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహింపజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బాఽధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే డాక్టరు ఎం.సుధీర్‌రెడ్డి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
చిలంకూరులో ఘోర రోడ్డు ప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
ఇద్దరు మృతి ఏడుగురికి గాయాలు
బాధితులంతా కూలీలే
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
కూలిన బతుకులు
Comments
Please login to add a commentAdd a comment