ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన మాథ్స్–1ఎ, బాటనీ, సివిక్స్ పరీక్షలకు 878 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జనరల్, ఒకేషనల్‌కు 19180 మంది విద్యార్థులకు గాను 18302 మంది హాజరు కాగా 878 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌కు 17655 మందికి గాను 16906 మంది హాజరు కాగా 749 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు 1525 మందికి గాను 1396 హాజరు కాగా 129 మంది గైర్హాజరయ్యారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
– కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు
కడప సెవెన్‌రోడ్స్ : నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వేంపల్లె గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీ ఎన్వీ సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రూ.1,88,70,213 గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ గ్రేడ్–2 పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న పి.రవిశంకర్‌రెడ్డి రూ.51,01,015, వేంపల్లె ఈఓపీఆర్‌డీగా పని చేస్తున్న బీవీఎస్ మల్లికార్జునరెడ్డి రూ.15,67,706 తమ వద్దనే ఉంచుకోవడం వల్ల వారిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వేంపల్లె పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్లుగా పని చేస్తున్న వంశీ, ఖాజా లక్షలాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణలో వెల్లడి కావడంతో వారిని తొలగించారు. వేంపల్లె ఇన్‌చార్జి సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎందుకు ఆయన చెక్ పవర్ రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు.
వైవీయూ వీసీ బదిలీ
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న పణితి ప్రకా్‌ష్‌బాబు పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన వైవీయూ వీసీగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. పది రోజుల్లోనే బదిలీ కావడంపై వైవీయూలో కొంత నిరాసక్తి నెలకొంది. బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే వైవీయూలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. వైవీయూలో చాలా నెలల పాటు ఇన్‌చార్జి వీసీ పాలన సాగింది. రెగ్యులర్ వీసీ వచ్చారని, అభివృద్ధి జరుగుతుందని ఆశించిన అనతి కాలంలోనే బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మళ్లీ త్వరగా రెగ్యులర్ వీసీని నియమిస్తారా లేక గతంలో మాదిరిగానే ఇన్‌చార్జి వీసీని కొనసాగిస్తారా అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
10న అప్రెంటిస్ మేళా
కడప ఎడ్యుకేషన్ : కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత గల ఐటీఐ అభ్యర్థులు తమ పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఎన్‌టీసీ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం. బ్యాంకు అకౌంట్ పుస్తకం, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ.7,700 నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్‌గా కంపెనీ వారు చెల్లిస్తారని వివరించారు. కావున విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. 8, 9 తేదీలలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు అయినప్పటికీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఒంటిమిట్టలో మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ మహోత్సవాన్ని గురువారం ప్రారంభించారు. ఉదయం 7.30 గంటల నుంచి టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్, వేదపండితులు భగవత్పుణ్యాహం, అగ్ని మదనం, ప్రధానమూర్తి హోమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి చతుస్థానార్చనం, సహస్ర కలశాధివాసం, శాత్తుమొర చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment