కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్ష జిల్లాల (ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్) ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలు నుంచి ‘ఆకాంక్ష జిల్లాల ఆశయ సాధన కార్యాచరణ ప్రగతి’పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ డాక్టర్ సచిన్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ‘నీతి ఆయోగ్’ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో వైఎస్‌ఆర్ జిల్లా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి) ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న ప్రగతిపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌కు వివరించారు. జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సీపీఓ హజ్రతయ్య, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, ఐసీడీఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, హార్టికల్చర్ డీడీ సుభాషిణి, పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, పోస్టల్ అధికారులు ఎన్‌ఆర్ బాషా తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment