యథేచ్ఛగా అక్రమ కట్టడాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

Published Sat, Mar 8 2025 1:03 AM | Last Updated on Sat, Mar 8 2025 1:02 AM

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

సాక్షి ప్రతినిధి, కడప : అది గ్రామ కంఠం స్థలం. సెంటు లక్షలాది రూపాయాలు పలుకుతున్న విలువైన భూమి. ఆ భూమిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. తెలియదని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని ఫిర్యాదులున్నాయి. అయినా కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నమే చేయలేదు. అక్రమ కట్టడాలు మేడలుగా వెలుస్తున్నాయి.

దువ్వూరు మండలం మారుమూల గ్రామంలో ఓ కుటుంబం 2009లో డీ ఫారమ్‌ పొందారు. 1935 నుంచి అక్కడే నివాసం ఉంటుండడంతో అప్పటి రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. ఆ స్థలంలో నివాసంతోపాటు డాబా కూడా నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతోంది. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లింపులు కూడా ఉన్నాయి. అయితే డాబా కేసీ కెనాల్‌ పొరంబోకు స్థలంలో ఉందని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరికి దువ్వూరు రెవెన్యూ యంత్రాంగం తెరలేపింది.

మండల కేంద్రమైన దువ్వూరులో సర్వే నంబర్లు 387/27లో 1.84 ఎకరాలు, 371/25లో 1 ఎకరం, 371/24లో 1.24 ఎకరాలు, 1430లో 50 సెంట్లు, 371/3లో 82 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం గ్రామకంఠంగా ఉంది. ఆయా భూముల్లో గ్రామ సచివాలం, సీ్త్ర శక్తి భవనం, వ్యవసాయ, హౌసింగ్‌ కార్యాలయాలు సైతం వెలిశాయి. ఆ ప్రాంతంలో సెంటు లక్ష రూపాయాలు పైబడి ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో గ్రామ కంఠం భూమి అన్యాక్రాంతమవుతోంది. అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కట్టడి చేయాలని గ్రామస్థులు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సైతం జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవిన్యూశాఖ నుంచి ఆశించిన ఫలితం కనిపించలేదు. పునాదులు పెద్ద పెద్ద భవంతులుగా వెలుస్తున్నా, అటువైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం కూడా చేయలేదు. అధికార పార్టీ మద్దతుదారులు ఆక్రమణదారులుగా అవతరించడమే అసలు కారణం.

ఇడమడకలో శరవేగంగా పావులు....

దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో నగిరి సుబ్బమ్మ, నగిరి సుభాషిణిలకు 2009లో రెవెన్యూ అధికారులు డీఫారమ్‌తోపాటు అనుబంధ ఫారమ్‌ (నివేశస్థల స్వాధీన ధ్రువీకరణ పత్రం) ఇచ్చారు. వారి కుటుంబం అదే స్థలంలో1935 నుంచి జీవిస్తున్నారు. అక్కడే ఇళ్లు, పక్కనే డాబా పెట్టుకొని జీవనం గడుపుతున్నారు. ఇంటిపన్నులు, విద్యుత్‌ బిల్లులు అన్నీ ఉన్నాయి. దాదాపు 90 ఏళ్లుగా మూడు తరాలకు చెందిన ఆ కుటుంబ సభ్యులు అక్కడ జీవిస్తున్నారు. కాగా రెవెన్యూ అధికారులు కేసీ కెనాల్‌ స్థలమంటూ కూల్చేందుకు నోటీసులు జారీ చేశారు.

ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకే...

ఇడమడక గ్రామంలో శ్రీకాంత్‌ కుటుంబం కేసీ కెనాల్‌ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు తహాసీల్దార్‌ కోర్టులో విచారణ చేపట్టాం. శ్రీకాంత్‌ కుటుంబానికి మంజూరైన డీఫారమ్‌ సర్వే నంబర్లు వేరుగా ఉన్నాయి. విచారణలో ఆ విషయం తేటతెల్లమైంది. తీర్పు వెలువడిన తర్వాత ఆర్డీఓ కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా కేసీ కెనాల్‌ స్థలమేనని తీర్పు లభించింది. ఆ మేరకే నోటీసులు జారీ చేశామని దువ్వూరు తహాసీల్దార్‌ అక్బల్‌బాషా తెలిపారు.

కక్ష్య సాధింపు చర్యలకు అండగా....

ఇడమడక గ్రామంలో ఎన్నికలకు ముందు నగిరి సుభాషిణి భర్త శ్రీకాంత్‌ మద్దతును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. అప్పట్లో రాజకీయాలతో నిమిత్తం లేకుండా తన పని చేసుకున్న శ్రీకాంత్‌కు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎలాగైనా సరే శ్రీకాంత్‌ కుటుంబం పొట్ట కొట్టాలనే తలంపుతో అధికార పార్టీ నేతలు ఉన్నారు. వారి సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం నేతలను ప్రసన్నం చేసుకోవాలని దువ్వూరు రెవెన్యూ అధికారులు ఉచిత సలహా కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూసేందుకోసమే రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గ్రామ కంఠం భూములపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

డీ ఫారమ్‌ పొందిన స్థలాల్లో

కట్టడాలు కూల్చేందుకు సన్నద్ధం

వింత వైఖరిలో

దువ్వూరు రెవెన్యూ అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement