12న ‘యువత పోరును’ను జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ తలపెట్టిన ‘యువత పోరు’ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ‘యువత పోరు’కు సంబంధించిన పోస్టర్లను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి కూపాలు కదిలే రీతిలో యువత పోరును విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా వారిని చదువుకు దూరం చేయాలని చూస్తున్న ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు కట్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.3900కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. దీనివల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోందన్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పిల్లల ఫీజులకు అవసరమైన డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టి పోయిన రూ.1800కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం సమంజసం కాదన్నారు. బకాయిలతో కలిపి ఇప్పటి వరకూ రూ.3900కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేవారు. లేనిపక్షంలో విద్యార్థులు తిరగబడటం ద్వారా తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment