
రాయంచపై రామయ్య విహారం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 7 నుంచి 8:30 గంటలకు హంసవాహనసేవ వైభవంగా జరిగింది. రాములోరు రాయంచపై కొలువుదీరి మాఢవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామా..మము బ్రోవుమా అంటూ భక్తజనం ప్రణమిల్లారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసకు పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తుల్లో అహంభావం తొలగించి శ్రీదాసోహంశ్రీఅనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామి వారు అధిరోహిస్తారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు. వేలాది మంది తరలిరావడంతో రామయ్య క్షేత్రంలో భక్తజన సందడి నెలకొంది. అంతకు ముందు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాఢవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 11 నుంచి కల్యాణవేదిక వద్ద ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ప్రణమిల్లిన భక్తజనం
నేటి కార్యక్రమాలు...
బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి సింహ వాహనంపై విహరిస్తారు.

రాయంచపై రామయ్య విహారం