
మైదుకూరు : మండలంలోని వనిపెంట శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.శ్రీకాంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగు గంగ కాలనీకి చెందిన శ్రీకాంత్ మోటార్ బైక్‌పై మైదుకూరు వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్రగాయాలతో ఉన్న అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న యువకుడిని కారు ఢీకొన్నట్టు పలువురు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నిలపకుండా వెళ్లినట్టు చెబుతున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కడే కుమారుడు
వనిపెంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారు డు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీకి చెందిన కుక్కే వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత శ్రీకాంత్ జన్మించాడు. శ్రీకాంత్ తన బావ నిర్వహిస్తున్న టెంట్ హౌస్‌లో పనిచేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రమాదంలో ఈ యువకుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.