
కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయండి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో జేసీ అదితిసింగ్ సింగ్‌తో కలిసి శ్రీ కోదండరామస్వామివారి కల్యాణో త్సవ విధుల నిర్వహణపై సంబంధిత లైజన్ అధికారులకు ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందన్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, జెడ్పి సీఈవో ఓబులమ్మ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనపై...
ఒంటిమిట్ట: రామయ్య కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే మార్గాలను, ఉండే ప్రాంతాలను కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వమించబోయే పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.