
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి
బద్వేలు అర్బన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు పి.చాంద్‌బాషా, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్‌సత్తార్, అన్వర్‌బాషా పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఫాతిమా మసీదు ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం మైనార్టీలపై అనేక రకాలుగా దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ క్రమంలోనే వక్ఫ్ చట్టసవరణ బిల్లును తెరమీదకు తీసుకువచ్చిందని అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాద పార్టీలు చిచ్చు పెట్టడం దారుణమన్నారు. కేంద్రం వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కరీముల్లా, హసన్, షరీఫ్, రసూ ల్, షంషీర్, ఇబ్రహీం, హబీబ్, మస్తాన్, ఆయుబ్, ఖలీల్, పెద్ద ఎత్తున ముస్లీంలు పాల్గొన్నారు.