వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. షర్మిల 206వ రోజు పాదయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు పజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా కొటారిబిల్లి జంక్షన్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరంఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు సభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నిన్నటి సభలో జగనన్నపైనే ఉండవల్లి విమర్శలు గుప్పించారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ఒక్క మాట అనకుండా సభ ముగించారని ఆమె దుయ్యబట్టారు. ఉదయించే సూర్యుణ్ని ఎవరూ ఆపలేరని, జగనన్న త్వరలోనే బయటకు వస్తారని షర్మిల అన్నారు. 130 కోట్ల విద్యుత్ బకాయిలు, 1200 కోట్ల రుణ మాఫీలు చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని ఆమె స్పష్టం చేశారు. పెన్షన్లు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తూనే..ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను ఒక్క పైసా కూడా వైఎస్సార్ పెంచలేదని షర్మిల తెలిపారు. ప్రస్తుత కిరణ్ సర్కారులో రైతులకు కరెంటు లేదు, ఎరువులు లేవన్నారు. భీమ్‌సింగ్ చక్కెర కర్మాగారం పరిధిలో 12 వేల ఎకరాలున్న చెరుకుసాగుకు మద్దతు ధర లేకపోవడంతో 8 వేల ఎకరాలకు పడిపోయిందని షర్మిల తెలిపారు. రాష్ట్రానికి అభివృద్ది లేదు, ప్రజలకు మనశాంతి లేదుగానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని అన్నారు. మద్యం డాన్ బొత్స సత్యనారాయణకు పీసీసీ అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం దారుణమని షర్మిల విమర్శించారు.