''ఇల్లు లేకపోతే అప్పు చేసైనా కట్టుకుంటాం. కొత్త రాజధానిని అలాగే కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇటుకైనా, దానికి సమానమైన డబ్బులైనా ఇవ్వాలని కోరుతున్నాను'' అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతివాళ్లూ.. అంటే 5 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉందనుకోవాలని, ప్రపంచం మొత్తం మన రాజధాని గురించే మాట్లాడాలని ఆయన అన్నారు. సింగపూర్ బృందం సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఏపీ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగపూర్ ప్రభుత్వానికి, ప్రధానికి, బృందానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్లే ఖర్చుపెట్టుకుని తెచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానీ పద్ధతి ప్రకారం నిర్మాణం కాలేదు. ఎక్కడా అంతర్జాతీయ స్థాయి రాజధానులు లేవు. కొన్ని చిన్న దేశాలు బ్రహ్మాండమైన రాజధానులు కట్టుకున్నాయి. సింగపూర్ సిటీ, టోక్యో ఇందుకు ఉదాహరణలు. స్మార్ట్ సిటీ అసలైన స్ఫూర్తితో రాజధానిని సిద్ధం చేయాలనుకున్నాం. ఇందులో ఆర్థిక కార్యకలాపాలు, ఎంటర్టైన్మెంట్, నివాసయోగ్యత, ఉద్యోగావకాశాలు అన్నీ ఉండాలి. 217 చదరపు కిలోమీటర్లలో రాజధాని నగరం వస్తుంది. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ ఎకానమీ ఉండాలని ప్లాన్లో తెలిపారు. 18 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాలనే ఆశయాలు పెట్టుకున్నాం. సీడ్ క్యాపిటల్లో 7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని చూస్తున్నాం. కల్చరల్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉండాలని అంటున్నాం బిజినెస్ ఎస్టేట్, రెసిడెన్షియల్ టౌన్ షిప్.. అన్నీ ఇందులో ఉంటాయి. రాజమండ్రిలో గోదావరి లాగే అక్కడ కృష్ణానది ఉంది. 3-5 కిలోమీటర్ల వెడల్పు, 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి రెండు పక్కలా భవనాలు కట్టుకోవచ్చు. ఈ నివేదిక రావడం ఒక ఎత్తు, దీనికి యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలి అవసరమైతే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో దీని నిర్మాణం చేపడతాం. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందంతో చేసుకోవచ్చు.
Published Mon, Jul 20 2015 5:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement