కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్‌హాల్లో ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, సమాజంలో మార్పుకోసం తెచ్చిన పథకాలను అభినందించారు. ‘దేశం ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి అంశాలపై దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాద చొరబాట్లపై సర్జికల్‌దాడులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. దీన్ని విజయవంతంగా అమలుచేసిన సైన్యం ధైర్య సాహసాలను ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారు.