గుంటూరు సంధ్యామూర్తి
సుస్వరాల సంగీతం.. శాస్త్రీయ నృత్యం.. ప్రయోగాలు చేస్తూ అనంత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఘనత. మూడేళ్ల ప్రాయంలో మొదలైన ప్రస్థానం.. కళకు వయస్సుతో నిమిత్తం లేదని చాటుతూ ఇప్పటికీ ఆ గళం గలగల పారుతుంటే.. ఆ పాదం ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తోంది. దేశ విదేశాలకు ఇక్కడి చిన్నారుల ప్రతిభను పరిచయం చేస్తూనే.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే శాస్త్రీయ సంగీత, నృత్యాలలో లెక్కకు మించి నిష్ణాతులను తీర్చిదిద్దిన విదుషీమణి సంధ్యామూర్తి.
అనంతపురం కల్చరల్: సంగీతమైనా, నాట్యమైనా గాంధర్వ కళ. జన్మతః అదృష్టం ఉంటేనే అబ్బుతుంది. మా పిల్లలెవరూ పూర్తిస్థాయి నాట్య రంగంలో లేకపోవడమే అందుకు నిదర్శనం. బంధాలు, బంధుత్వాలు శాశ్వతం కాకపోయినా.. కళను నమ్ముకుంటే జీవితాంతం తోడుంటుంది. జీవితాన్ని రంగులమయం చేయగలిగిన సత్తా ఒక్క కళకు మాత్రమే ఉంది. శిష్యులు కూడా గురువుల పట్ల గౌరవభావంతో మెలిగినప్పుడే నాట్యంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం దక్కుతోంది. నేను పుట్టి పెరిగింది అనంతలోనే. మూడేళ్ల ప్రాయంలోనే మా నాన్న పీఎస్ శర్మ ప్రోత్సాహంతో నాట్య ప్రవేశం చేశా. అప్పట్లో ఆయన లలిత కళాపరిషత్ సెక్రటరీ. మైసూరు నుంచి అనంతపురానికి వచ్చిన నాట్యకోవిదులు వరదరాజ అయ్యంగార్ వద్ద భరతనాట్యం, పార్వతీశం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. చెన్నైకి చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీ సంగీతం నేర్చుకున్నా. అప్పటికి నా వయస్సు ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూ కైలాస్ నాటకంలో బాల వినాయకునిగానూ నటించా.
పరాయి రాష్ట్రాల్లోనూ అనంత కీర్తి
మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలలకంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్‌లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరతనాట్యం నేర్పించాను. ఇప్పటికీ నా శిష్యులు పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నా.
భరతనాట్యమే నృత్యమనుకునేవారు
నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో భరత నాట్యమంటేనే శాస్త్రీయ నృత్యం. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవాళ్లు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ వచ్చింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లంతా రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఆ స్ఫూర్తి నేను రంగస్థలంపై ప్రయోగాలు చేసేందుకు కారణమైంది. ఎన్నోమార్లు వెంపటి చినసత్యం నన్ను మెచ్చుకున్నారు. అలాగే వేదాంతం సత్యనారాయణ మా ఇంటికొచ్చేవారు. వారందరి చలువతో మహిళలు భరతనాట్యంతో పాటు కూచిపూడి నేర్చుకోగలుగుతున్నారు.
1969లోనే శ్రీ నృత్య కళా నిలయం
వరదరాజ అయ్యంగార్ తర్వాత కృష్ణకుమార్ లలిత కళా పరిషత్‌లో, అప్పారావు కృష్ణ కళామందిరంలో శాస్త్రీయ నృత్యాలు నేర్పించారు. అమీర్‌బాషా కూడా నృత్యంలో శిక్షణిచ్చేవారు. వీరి స్ఫూర్తితో 1969లో శ్రీనృత్య కళానిలయాన్ని తీర్చిదిద్దాం. జిల్లాలోనే ఇది తొలి సంగీత, నాట్య పాఠశాలగా గుర్తింపు ఉంది. వేలాది మంది విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం నేర్పిన మా పాఠశాల నుంచే నాట్య గురువులుగానూ ఎదిగారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మి ‘విదూషీ’ శిక్షణ పొందారు.
నృత్యంతో ఆత్మవిశ్వాసం
శాస్త్రీయ నృత్యంతో ఆధ్యాత్మిక భావజాలంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కళకు వయస్సుతో సంబంధం లేదని చాటడంలోనూ ఈ నృత్యం పాత్ర ఎనలేనిది. భారతీయ సంస్కృతీ, పురాణ ఇతిహాసాల విశిష్టత నృత్యాలలో ధరించే పాత్రలు కళ్లకు కడతాయి.
ఆ రోజుల్లో దేవదాసీలనేవారు..
మా చిన్నప్పుడు మహిళలకు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో భావించేవారు. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. కళపై ఉన్న అభిమానంతో మా నాన్న నాకు పద్నాలుగేళ్లు వచ్చే వరకు చెప్పించి ఆ తర్వాత మాన్పించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. మేము ఆ రోజుల్లోనే వారికి రూ.25 ఇచ్చేవాళ్లం. ఇప్పుడది ఏ నాలుగైదు వేలకో సమానం.
ప్రపంచ రికార్డు ప్రదర్శనలు
పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా అనేక రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. ఆయా ప్రాంతాల్లోనూ నేను నాట్యం నేర్పించాను. అనంతపురం చేరుకున్న తర్వాత మా శిష్య బృందంతో న్యూఢిల్లీ, పూణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా తదితర ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శనలిచ్చాం. ముఖ్యంగా 2014లో 155 మంది సంగీత కళాకారులతో ‘అన్నమయ్య శత అష్టోత్తర సంకీర్తనార్చన’ను ఏడు గంటల పాటు నిర్విరామంగా చేపట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాం. మరుసటి సంవత్సరం 2015లో 135 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో ‘దశదేవతా నృత్యారాధన’ను ఏడు గంటల పాటు నిర్వహించి మరో ప్రపంచ రికార్డును అనంత కీర్తిని విశ్వవ్యాప్తం చేశాం.
వారసులంతా ఘనులే..
ఒక్కోసారి మా శిష్యులను తలచుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది. నా దగ్గర విద్య నేర్చుకున్న నాట్య మయూరి శోభారాణి హైదరాబాద్‌లో, ప్రసన్న లక్ష్మి మైసూరులో, శివప్రసాద్ అనంతపురంలో.. హరినాథబాబు, వారిజ హిందూపురంలో, ప్రత్యూష గుంతకల్లులో, మహాలక్ష్మి బెంగళూరులో గొప్ప శిక్షకులుగా శిక్షణాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక మా అమ్మాయి అను«రాధ ఎంఏ డాన్స్ చేసి ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో కల్చరల్ కోఆర్డినేటర్‌గా ఉంది. ఇలా మా విద్య కీర్తితో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.
బయోడేటా
పూర్తి పేరు : గుంటూరు సంధ్యామూర్తి
జననం : అనంతపురం
పుట్టిన తేదీ : 22–06–1953
తల్లిదండ్రులు : పీఎస్ శర్మ, సరస్వతమ్మ
భర్త : కృష్ణమూర్తి
సంతానం : నందకుమార్(కొడుకు), అనురాధ(కూతురు)
తొలి ప్రదర్శన: 1956లో లలితకళా పరిషత్తులో అరంగేట్రం
అవార్డులు : కళానీరాజనం, సంగీత నృత్య సరస్వతి, ఉగాది పురస్కారం, నాట్యరత్న, అనంత ఆణిముత్యం
స్ఫూర్తి : నాన్నగారితో పాటు నాట్య విద్వాంసులు వరదరాజ అయ్యంగార్
Comments
Please login to add a commentAdd a comment