
ఖమ్మంజెడ్పీసెంటర్: ప్రభుత్వ ఆస్తులు దొంగల పాలవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మూడేళ్లల్లో 34 పాఠశాలల్లో 372 కంప్యూటర్లు చోరీ అయినా ఎవరూ స్పందించడంలేదు. ఎస్పీ, కలెక్టర్, డీఈఓలు, జేడీలు మారినా కేసులు లేవు, రికవరీలు లేవంటూ పాఠశాల స్వచ్ఛంద సేవకుడు కలెక్టర్ లోకేష్‌కుమార్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ వినయ్‌కృష్ణారెడ్డి, డీఆర్‌ఓ శివశ్రీనివాస్‌లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన కోటేరు నాగిరెడ్డి పాఠశాలలో కంప్యూటర్లు చోరీ సంఘటనలను కలెక్టర్‌కు వివరించారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కోటి రూపాయలు చోరీ జరిగినా గంటలోనే మన పోలీస్ అధికారులు పట్టుకొని రికవరీ చూపిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. చోరీకి గురైన చోట ఏఏ సెల్‌టవర్లు ఉన్నాయో వివరాలు తెలియజేయాలని పోలీస్ అధికారులు అడిగారని, ఆ వివరాలు సైతం అందించినా నేటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. నాగిరెడ్డి మాటలు విన్న కొందరు అధికారులు కొద్దిసేపు మిన్నకుండిపోయారు.
ఖమ్మం నగరంలోని సరిత క్లీనిక్ ప్రాంతానికి చెందిన కొప్పుల ఈదమ్మ తన కుమారుడు రామారావు తన పేరుతో ఉన్న ఇంటి పట్టా, ఆస్తులు మొత్తం తీసుకున్నాడని, వృద్ధాప్యంలో ఉన్న తనకు పట్టెడన్నం పెట్టేందుకు వెనుకాడుతున్నాడని, నెలకు 2 వేలు భృతి కల్పించాలని కలెక్టర్ ఎదుట విలపించింది. దీంతో కలెక్టర్, జేసీలు ఆర్డీఓను కలవాలని అక్కడకు ఆటోలో పంపించేలా ఏర్పాటు చేశారు. ఆర్డీఓను ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా పిల్లల ఆశ్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఆశ్రమంలో నూకలతో అన్నం వండిపెట్టడంతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, సీడబ్ల్యూసీ కమిటీ సైతం నిర్వాహకులను అనర్హులుగా ప్రకటించి లైసెన్స్ జారీ చేయలేదని, అయినా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శ్యామ్‌డేవిడ్ ఫిర్యాదు చేశారు.
కొత్తకలెక్టరేట్ ప్రతిపాదనను విరమించుకొని పాత కలెక్టరేట్‌లోనే పరిపాలన కొనసాగించాలని, కార్యాలయాలన్ని ఒకే చోట అందుబాటులో ఉంచాలనే పేరుతో కలెక్టరేట్ కోసం స్థల సేకరణ చేయడం తగదని, గతంలో పది నియోజకవర్గాలు, 46 మండలాలు ఉన్నాయని, ప్రస్తుతం జిల్లాల విభజనతో 5 నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయని, కొత్త కలెక్టరేట్ భవనం అవసరం లేదని, కోట్లాది రూపాయలతో భూములు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీల నేతలు పొన్నం వెంకటేశ్వర్లు, బాగం హేమంతరావు, ఆవుల వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, బాలగంగాధర్ తిలక్, కోలేటి నాగేశ్వరరావు, మోడెం వెంకన్న, ప్ర జా సంఘాల నాయకులు క్రిష్ణారావు, పాపారావు, జ్వలిత, లింగాల రవికుమార్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
చిమ్మపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లిష్ టీచర్‌ను కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్ లోకేష్‌కుమార్ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తమ పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యను వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సంబంధిత సమస్య మండల స్థాయిలో లేదా డివిజన్ స్థాయిలో లేకుంటే ఉన్నతాధికారుల స్థాయిలో ఉంటే సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపాలన్నారు. ఒకే సమస్యపై పలుమార్లు దరఖాస్తులు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment