భార్య గొంతు కోసిన ఘనుడు
Published Sun, Aug 4 2013 5:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
పలాస, న్యూస్‌లైన్: పోలీసులు కౌన్సెలింగ్ చేయడాన్ని అవమానంగా భావించి ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతుకను బ్లేడుతో కోసి ఆతర్వాత తనూ కోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాశీబుగ్గ న్యూకాలనీ చాకలి చెరువు గట్టు వీధిలో శనివారం రాత్రి 7 గంటల సమయం లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవీ... న్యూకాలనీకి చెందిన మర్రి మురళీకృష్ణ తన భార్య అనూరాధ కనిపించడంలేదని 15 రోజుల కింద ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితులను పిలిపించి ఆరా తీశారు.
ఈ నేథ్యంలో గత నెల 29వ తేదీన ఇంటికి వచ్చిన అనూరాధ తాను విశాఖపట్నంలో ఉంటున్న తం డ్రి ఓడరేవు మంగరాజు ఇంటికి వెళ్లానని చెప్పారు. అప్పటికే పోలీస్ స్టేష న్‌లో ఫిర్యాదు ఉండడంతో ఆమె పోలీసులకు భర్తపై కేసు నమోదు చేయించారు. దీంతో పోలీసులు శనివారం ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. ఇంటికి తిరిగివస్తుండగా చెరువుగట్టు వీధిలో మురళీకృష్ణ బ్లేడుతో భార్య గొంతు కోశాడు. ఆమె కేకలు వేస్తూ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన అదే బ్లేడుతో తన గొంతుక కూడా కోసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి ఇద్దరినీ పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసి కాశీబుగ్గ సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్‌ఐ ఆర్.వేణుగోపాలరావు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement