సమైక్య రాష్ట్రం కోసంఒక గుండె ఆగింది | about state divide a heart has stopped | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్రం కోసంఒక గుండె ఆగింది

Published Tue, Aug 6 2013 3:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

about state divide a heart has stopped

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒక గుండె ఆగింది.. సమైక్య రాష్ట్రం కోసం జిల్లా లో తొలి బలిదానం జరిగింది. మరోవైపు జిల్లా అంతటా సమైక్య ఉద్యమ సెగ రాజుకుంది. రోడ్లపైనే వంటావార్పులు, పిండ ప్రదానాలు, గుండు గీయించుకోవడాలు, నాయకుల శవయాత్రలు, రాస్తారోకోలు సోమవారం ఉద్ధృతంగా సాగాయి. పలాసలో జీడిపప్పు పరిశ్రమ బంద్ పాటిం చింది. ఇంకా పలు పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. బస్సులు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. లావేరు మండలం గుమడాం గ్రామంలో పొడమచ్చిలి బంగారి (51) అనే వ్యక్తి టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర విభజనను తట్టుకోలేకే బంగారి మరణించడాని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. 
 
 నైర వ్యవసాయ కళాశాలలో.. నైరలోని ఆచార్య ఎన్‌జీ. రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 3 గంటలపాటు రవాణా స్తంభించింది. అనంతరం కేసీఆర్, సోనియా, బొత్సల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని లంకాం కూడలి వద్ద యువకులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహిం చారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ద హనం చేసి సుమారు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఇటు వాకలవలస, అటు నందగిరిపేట కూడలి వర కూ ట్రాఫిక్ నిలిచిపోయింది. కరజాడ సమీపంలో కరజాడ, బైరి గ్రామాల యువకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు జాతీయ ర హదారిని దిగ్బంధించారు. వాకలవలస,  అలికాం కాలనీల వాసులు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. 
 
 పాలకొండలో.. నియోజకవర్గంలో సోమవారం దాదాపు 15 చోట్ల సోనియా, కే సీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. న్యాయవాదులు రోడ్డుపైనే కుర్చీలు వేసుకుని కూర్చొని రాకపోకలు నిలిపివేశారు. ఆందోళనకారులు సినిమా హాళ్లను కూడా మూయించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు అంతా సంఘటితమై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను గాజులు వేసుకున్న మహిళలుగా చూపుతూ వేసిన చిత్రాలను ప్రదర్శించారు. సోనియా శవయాత్రలో ఓ సమైక్యవాది అర్ధనగ్నంగా తలకొరివి పట్టుకొని దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ ప్రత్యేకతను చాటుకున్నాడు. సాయంత్రం ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
 
 నరసన్నపేటలో.. స్థానిక డీఆర్‌ఎన్ కళాశాల విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఆటో యూనియన్ సభ్యులు ఆటోల ర్యాలీ నిర్వహించారు. రెడీమేడ్ వర్తక సంఘం ప్రతినిధులు ర్యాలీ నిర్వహించగా, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు కాలేజీ రోడ్డు వద్ద మానవహారం నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. 
 
 పలాసలో... పలాస కాశీబుగ్గ పట్టణాలకు చెందిన జీడి పారిశ్రామికవేత్తలు, కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. జీడి పరిశ్రమలను బంద్ చేశారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాశీబుగ్గ కె.టి.రోడ్డులో టైర్లు కాల్చారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రజ్ఞ విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఆటో రిక్షా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మందస మండలం హరిపురంలో అన్ని వర్గాల ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇంటి ముందు బైఠాయించారు. 
 
 ఇచ్ఛాపురంలో... స్వర్ణభారతి పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. సోనియా, కేసీఆర్, చిదంబరం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సోంపేటలో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కంచిలి రైల్వే స్టేషన్ జంక్షన్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాకపోకలు నిలిపివేశారు. రోడ్డు కిరువైపులా తాళ్లు కట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన నిర్వహించారు. 
 
 రాజాంలో... రాజాంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. పలు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పొగిరి, ఒమ్మి గ్రామాల వద్ద  సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజాం నగర పంచాయతీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
 
 టెక్కలిలో... ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలిలో జర్నలిస్టులు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది కార్మికులు ఆటో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. కె.కొత్తూరు వద్ద జాతీయ రహదారిలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పలు పాఠశాలల విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
 
 ఎచ్చెర్లలో... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి దిగ్బంధించారు. జేసీ పి.భాస్కర్ కారును చుట్టుముట్టారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి కృపారాణి చిత్రపటంతో విద్యార్థులు భిక్షాటన చేశారు. లావేరు మండలం సుభధ్రాపురం కూడలిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రణస్థలం, పైడి భీమవరం కూడళ్లలో జాతీయ రహదారిపై యువకులు రాస్తారోకోలు చేసి ట్రాఫిక్ స్తంభింప జేశారు. జి.సిగడాం మండలం పాలఖండ్యాంలో జూట్ మిల్లు కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ధర్నా చేశారు. సంతవురిటిలోయువకులు ధర్నా నిర్వహించి సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి పిండ ప్రదానం చేశారు.
 
 పాతపట్నంలో... ఎన్జీవోలు, సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు గ్రీవెన్స్‌సెల్‌ను నిలిపివేయాలని కోరుతూ మండల ప్రత్యేకాధికారి కె.స్వామినాథన్‌ను కోరడంతో గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం నిలిచిపోయింది. మెళియాపుట్టిలో పూర్తి బంద్ జరిగింది. మెళియాపుట్టి, చాపర, వసుంధర, జాడుపల్లి గ్రామాల్లో రోడ్లకు అడ్డంగా బెంచీలు, కర్రలు వేయడంతో పాటు టైర్లను కాల్చారు. మెళియాపుట్టి మూడు రోడ్ల జంక్షన్ వద్ద వంటావార్పు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం జరుగలేదు. కొత్తూరులో ఆటో డ్రైవర్ యూనియన్, విద్యార్థులు, యువకలు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మెట్టూరు, కుంటిభద్ర, గూనభద్రల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గూనభద్ర జూట్ మిల్లు కార్మికులు ఆందోళన చేశారు. బొర్రంపేటలో గామస్తులు, యువకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్‌ఎన్ పేటలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement