నృత్యం రెండు దేశాల సంస్కృతికి వారధిగా నిలిచింది. అదే నృత్యం రెండు మనస్సులను కలిపి పెళ్లికి నాంది పలికింది.
అనకాపల్లి, న్యూస్‌లైన్: నృత్యం రెండు దేశాల సంస్కృతికి వారధిగా నిలిచింది. అదే నృత్యం రెండు మనస్సులను కలిపి పెళ్లికి నాంది పలికింది. దేశాల మధ్య ఉన్న భౌగోళిక హద్దులను చెరిపి ఇద్దరినీ ఒక్కటి చేసింది. అనకాపల్లికి చెందిన యువకుడికి వియత్నాంలోని యువతితో పెళ్లికి దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలివి...
ఎలా కలిశారంటే....
అనకాపల్లికి చెందిన కాండ్రేగుల సంతోష్‌కుమార్ వియత్నాంలో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు. వాస్తవానికి సంతోష్ అన్న విజయ్ ముందుగా థాయ్‌లాండ్‌లో నృత్య దర్శకునిగా స్థిరపడి, వియత్నాం, చైనాలలో పని చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో తమ్ముడు సంతోష్‌ను డ్యాన్స్‌లో ప్రావీణ్యం పొందేలా చేసింది. ఇలా అన్న ప్రేరణతో డ్యాన్స్ మాస్టరయిన సంతోష్ కుమార్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన లాన్సియా ప్రియా (లిండీ)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈమేరకు యువతీ, యువకుల పెద్దలు ప్రేమను పెళ్లిగా మార్చేందుకు అంగీకరించడంతో అనకాపల్లి గవరపాలెంలోని కొణతాల సుబ్రహ్మణ్యం కల్యాణ మండపం రెండు దేశాల వధూవరుల వివాహానికి వేదికగా మారింది.
పరదేశీ సంప్రదాయమైనా సహనంగా, ఆసక్తిగా... : వియత్నాంకు చెందిన లిండీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అవగతం కాలేదు. అయినప్పటికీ కాబోయే భర్త సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం గమనార్హం. శుక్రవారం ఉదయమే వరుడి ఇంటి వద్ద కాళ్ల గోళ్లు, ఇతర హిందూ సంప్రదాయాలను ఆసక్తిగా చూసిన లిండీ అచ్చం తెలుగు అమ్మాయిలాగే పెళ్లికి వచ్చేవారికి కనిపించింది. పట్టణంలో ఈ పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రేమకు,పెళ్లికి దేశాలు,సంప్రదాయాలు అడ్డురావని నిరూపించింది. ఇండియా, వియత్నాంకు జోడీ కుదిర్చింది.