
యూటర్న్ తీసుకోలేదు : కావూరి
ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే పరిస్థితులు మరింత సంక్లిష్టం అవుతాయని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే పరిస్థితులు మరింత సంక్లిష్టం అవుతాయని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. కొందరి వ్యక్తుల కోసం రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమన్నారు. 42మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ను విభజించి సాధించేది ఏంటని కావూరి ప్రశ్నించారు. కలిసి ఉంటేనే గౌరవం ఉంటుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు వస్తూనే ఉంటాయని కావూరి అన్నారు. విభజనపై తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపానని ఆయన అన్నారు. తాను యూటర్న్ తీసుకోలేదని, కొంతమంది తాను యూటర్న్ తీసుకున్నానంటే బాధ వేస్తుందన్నారు. తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ రాష్ట్రంగా ఉందని తన భావన అన్నారు. రాష్ట్ర విభజన జరగకూడదనే అనుకున్నానన్నారు.
అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే జరిగిందని కావూరి అన్నారు. ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వచ్చి జీవిస్తున్నవారు..... ఇప్పుడు హైదరాబాద్ తమది కాదు అనేది అందర్ని బాధిస్తుందన్నారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల విభజన మంచిది కాదని, చిన్న రాష్ట్రాల వల్లే ఎలాంటి అభివృద్ధి, ప్రయోజనం ఉండదనేది తన అభిప్రాయమన్నారు.
రాష్ట్ర విభజన దేశానికి మంచిది కాదని 9మంది కేంద్రమంత్రులు కేంద్రానికి తెలిపామని కావూరి అన్నారు. భవిష్యత్లో వచ్చే పరిణామాలు, సమస్యలను అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు. ఆలస్యం చేయకుండా సముచిత నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు కావూరి చెప్పారు. తమ విజ్ఞాపనల ఫలితంగానే ఆంటోనీ కమిటీని కేంద్రం వేసిందని ఆయన తెలిపారు. నాలుగేళ్లు ఆగామని.... ఇంకా నాలుగు రోజులు ఆగి చర్చల అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. అయితే ఇప్పటికి కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని కావూరి తెలిపారు.