సాక్షి,విజయవాడ: ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై ప్రేమ నటిస్తూ ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం అర్హులందరికీ అందడం లేదు. రైతులకు రెండు విడతలు రుణమాఫీ, మూడేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీలు, బీమాలు ఇవ్వకుండా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టడం..దాన్ని సమర్థంగా అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పథకం
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నేరుగా విడతలవారీగా రూ.9వేల జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రూ.1000, రెండో విడత రూ.2వేలు.. మిగిలిన సొమ్ము రబీలో జమ చేస్తామని చెప్పారు. అయితే చాలా మంది ఖాతాల్లో తొలి విడత రూ.1000 కూడా జమ కాలేదు.
జిల్లాలో భూ కమతాలు..
జిల్లాలో 6.14లక్షలు మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే అన్నదాత సుఖీభవకు 3.99 లక్షల కుటుంబాలే ఎంపికయ్యాయి. ఈ విధంగా ఎంపికైన వారిలో 61,938 మందికి ఇప్పటి వరకు కనీసం రూ.1000 జమ కాలేదు. ఆధార్ నంబర్లు వారి వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేయకపోవడం వల్లనే డబ్బులు పడటం లేదని అధికారులు చెబుతున్నారు.
అనర్హులకు డబ్బులు
అయితే సెంటు భూమి లేని వారి బ్యాంకు ఖాతాలకు రూ.1000 జమ అవుతోంది. గుడివాడ, పెనమలూరులలో ఈ విధంగా డబ్బులు జమ అయ్యాయి. కాగా కొన్ని చోట్ల చనిపోయిన వారి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమయ్యాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
లబ్ధిదారుల పరిశీలన నిల్..
అన్నదాత సుఖీభవకు అర్హులైన వారి వివరాలను వ్యవసాయశాఖాధికారుల నుంచి తీసుకోలేదు. వెబ్‌ల్యాండ్‌ను అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లబ్ధిదారులను ఎంపిక రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు చేశారు. దీంతో అనేక వేల మంది ఈ పథకానికి అర్హత పొందలేకపోయారు.
రియల్ టైమ్ గవర్నెర్స్ మాయ..
రియల్ టైమ్ గవర్నర్స్ నుంచి ఆయా వసాయశాఖాధికారులకు లిస్టులు వస్తున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం కాని వారి ఫోన్లు నంబర్లు పంపుతున్నారు. ఆ ఫోన్లకు అను సంధానం చేసే బాధ్యత అధికారులకు అప్పగించారు. ఈ విధంగా అనుసంధానం చేసిన తర్వాత కూడా వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో లేదో అధికారులకు తెలియదు.
అధికారులు చుట్టూ రైతులు ప్రదక్షిణలు..
పథకంలో కొంతమందికి డబ్బులు వచ్చి మరికొంతమందికి డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు మండల వ్యవసాయశాఖాధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాము ఏమీ చేయలేమని, అన్ని అర్హతలు ఉంటే వారి పేరు ఆర్టీజీఎస్‌కు పంపుతామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment