సాక్షి, అమరావతి: ఈసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన రోజునే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టబోతున్నారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో అటు ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇటు విడిపోయిన తరువాత గానీ ఇలాంటి అసాధారణ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 16న రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సమావేశాలు ఆ తరువాత 17వ తేదీ మరొక్క రోజు మాత్రమే జరగబోతున్నట్లు అనధికారిక సంకేతాలు అందుతున్నాయి.
గతంలో ఎలా..
► వాస్తవానికి బడ్జెట్ సాధారణ సమావేశాలు కనీసం రెండు వారాలకు పైగా జరిగే సంప్రదాయం ఉంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో అయితే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఆరు వారాలపాటు దీర్ఘకాలికంగా జరిగితే.. అందులో సెలవులు పోను కనీసం 28 నుంచి 31 రోజుల వరకూ పూర్తి పని దినాలుండేవి.
► విభజన తరువాత బడ్జెట్ సమావేశాల కాలాన్ని రెండు నుంచి మూడు వారాలకు కుదించుకున్నారు. అందులో 12 నుంచి 14 పని దినాలు అనివార్యంగా ఉండేవి.
► గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రారంభానికి ఒక రోజు వ్యవధి ఉండేది. సాధారణ బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన తరువాత మధ్యలో ఒక రోజు కంటే మించి విరామం ఉండేది.
► ఆ తరువాతే చర్చ ప్రారంభమై శాఖల పద్దుల వారీగా చర్చలు జరిపి ఆమోదించేవారు. సమావేశాలు చివరకు వచ్చేప్పటికి ద్రవ్య వినిమయ బిల్లును ఉభయ సభలూ విడివిడిగా ఆమోదించేవి. ప్రస్తుతం ఈ ప్రక్రియకు ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడిలా..
► ఈ నెల 16వ తేదీ సమావేశాల తొలి రోజున ఉదయం 10 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్‌భవన్ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా వెలగపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది గంటసేపు ఉంటుందని అంచనా.
► గవర్నర్ రాజ్‌భవన్ నుంచి ప్రసంగించినా.. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూసే అవకాశం ఆయనకు ఉంటుంది. ప్రసంగం ముగిసిన వెంటనే సంయుక్త సమావేశం ముగుస్తుంది.
► ఆ వెంటనే ఆయా సభల బీఏసీ సమావేశాలు విడివిడిగా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ చాంబర్లలో జరుగుతాయి. కార్యక్రమాల ఖరారుపై నిర్ణయం తీసుకున్న అనంతరం గంట సేపటికి ఉభయ సభలూ విడివిడిగా సమావేశమవుతాయి.
► వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. నిర్దేశిత, నియమిత సమయాలను కచ్చితంగా పాటిస్తూ పరిమితంగా సభ్యులను చర్చకు అనుమతిస్తారు. తీర్మానం ఆమోదించిన తరువాత ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.
► వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ఆ వెంటనే ప్రతిపాదిస్తారు. వెనువెంటనే చర్చ ప్రారంభమై సాధారణ బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అంటే.. 17వ తేదీన ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
► అదే రోజున ఉభయ సభలూ దశల వారీగా ప్రభుత్వ శాఖల పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో రోజు సాయంత్రంలోపు ఈ తంతు అంతా పూర్తి కావాలని భావిస్తున్నారు.
ఎందుకిలా..
► కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పరిణమించడంతో అనివార్యంగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
► కోవిడ్–19 నేపథ్యంలో దాని వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
► దీంతో రాష్ట్రంలోనూ మార్చి 24వ తేదీ నుంచి ఆ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం సహా పలు మార్గదర్శకాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.
► ఈ దృష్ట్యా బడ్జెట్ సమావేశాలను అన్ని సంప్రదాయాలకు భిన్నంగా.. అసాధారణ రీతిలో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజులకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది.
రాజ్యాంగం ప్రకారమే..
► ఆరు నెలలు దాటక ముందే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు తప్పనిసరిగా జరపాల్సి ఉండటంతో ముందుగానే ఈ సమావేశాల నిర్వహణకు పూనుకున్నారు. 2020 జనవరిలో చివరి సారిగా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి.
► ఆ ప్రకారం ఆరు నెలల లోపు అంటే జూలై 22వ తేదీకి ముందే సమావేశాలు జరపాల్సి ఉంది. కానీ, ఈ ఆర్ధిక ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను కరోనా నేపథ్యంలో మార్చిలో నిర్వహించలేకపోవడంతో తొలి త్రైమాసికానికి అంటే ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు వ్యయానికి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించారు.
► జూలై నుంచి వ్యయానికి తప్పనిసరిగా బడెŠజ్‌ట్‌ను అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి పరిమిత రోజుల బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment