జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నూతన ఓటర్ల నమోదు, తొలగింపు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, కార్యకర్తలు దీనిని గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటు నమోదు చేసుకునేలా చైతన్య పర్చాలని అన్నారు. కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ఓటర్ లిస్టు పరిశీలించి నమోదు, తొలగింపు వివరాలు అధికారులకు తెలియజేయాలని అన్నారు. అందులో భాగంగా ఓటర్ల లిస్టును జిల్లా కమిటీ అన్ని మండల కమిటీలకు పంపించిందన్నారు.
12వ తేదీలోగా పోలింగ్ బూత్ కమిటీలు సిద్ధం...
ఈ నెల 12వ తేదీలోగా జిల్లాలో గ్రామ, పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించిందని, అందులో భాగంగా మండల పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ముందుగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సహకారంతో మండల కన్వీనర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులను సమన్వయ పర్చుకుంటూ నియమించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు పని చేయాలని అన్నారు.
రైతులను ఆదుకోవడంలో విఫలం...
భద్రాచలం, అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడ్ మండలాల్లో గోదావరి వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఏడాది పలుమార్లు గోదావరికి వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికీ అధికారులు పంట నష్టం వేయలేదని అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కడియం రామాచారి, సీనియర్ నాయకులు తాండ్ర వెంకటరమణ, ఘంటా కృష్ణ, మంత్రిప్రగడ నర్సింహారావు, కొర్సా చినబాబు దొర, హర్షవర్ధన్‌లు పాల్గొన్నారు.