సమస్యలతో సతమతమవుతున్న పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: సమస్యలతో సతమతమవుతున్న పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలు విడుదలవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిన ఉంది. పారిశుధ్యం, తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యలను అధిగమించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకాన్ని నూతనంగా అమలు చేయనుంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు విడుదల చేస్తాయి. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలో చాలా పంచాయతీలకు సొంత భవనాలు లేవు. దీంతో సమావేశాలు నిర్వహించడానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. మరి కొన్ని పంచాయతీలకు భవనాలున్నా శిథిలావస్థలో ఉన్నాయి. కొత్త పథకంలో భాగంగా విడుదల చేసే నిధులను పంచాయతీల భవన నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తారు. అదే విధంగా భవనాల మరమ్మతులకు ప్రతిపాదిస్తారు.
అమలు తీరు ఇలా..
ఈ పథకంలో భాగంగా గ్రామాలపై అవగాహన ఉన్నకొందరు ఉత్సాహవంతులను ఎంపిక చేస్తారు. వారికి శిక్షణ ఇచ్చి గ్రామాలకు పంపిస్తారు. వీరు ఊరూరా తిరిగి వివరాలు సేకరిస్తారు. గ్రామాలు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తారు. ప్రజలతో చర్చిస్తారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, వనరులు, గ్రామాభివృద్ధికి ఏం చేయాలి తదితర అంశాలను తెలుసుకుంటారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఐదేళ్లకు ప్రతిపాదనలను రూపొందిస్తారు. గ్రామ సభలో తీర్మానం చేయించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. పథకం విజయవంతం కావాలంటే అందరి భాగస్వామ్యం అవసరం. ప్రత్యేక శిక్షణ పొందిన వలంటీర్లతో పాటూ గ్రామంలోని కార్యదర్శులు, సాక్షరభారత్ వలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గోపాల మిత్రలు, గ్రామ పెద్దలు, యువకులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను పథకంలో భాగస్వాములు చేస్తారు. పథకం అమలుకు ప్రత్యేక అధికారిని నియమిస్తారు.