ఏటీఎం కార్డు దొంగల అరెస్టు
Published Wed, Aug 28 2013 5:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
విశాఖ, న్యూస్‌లైన్: విశాఖ నగరంలోని కేజీహెచ్‌కి వైద్యానికి వచ్చిన ఓ మహిళ ఏటీఎం కార్డును చోరీ చేసి ఆమె అకౌంట్ నుంచి నిధులు డ్రా చేసి జల్సాలకు పాల్పడిన ముగ్గురు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల డీసీపీ పి.విశ్వప్రసాద్ చోరీ వివరాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం నెయ్యల వీధికి చెందిన భీమరాణి పట్నాయక్ వైద్య పరీక్షల నిమిత్తం జూలై 20న కేజీహెచ్‌కి వచ్చారు.
వైద్య ఖర్చుల కోసం సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి కొంత నగదు డ్రా చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బ్యాగులో పెట్టిన ఆమె ఏటీఎం కార్డును కంచరపాలెం, కప్పరాడకు చెందిన బండి ప్రసాద్(20), కూర్మాపు సాగర్ (24), అలజంగి హేమంత్‌కుమార్(22) చోరీ చేశారు. కార్డు కవర్‌లోనే ఏటీఎం పిన్‌కోడ్ కూడా ఉండడంతో ఆమె అకౌంట్ నుంచి రూ.14 వేలు డ్రా చేసి వాడుకున్నారు.
నిధులు డ్రా అయిన విషయాన్ని గమనించిన బాధితురాలు జూలై 24న ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు సైబర్ క్రైంకు బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై ఎస్.రమేష్ సిబ్బంది సహకారంతో నిందితులు ముగ్గురినీ కప్పరాడ జంక్షన్‌లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13 వేల నగదు, ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో క్రైం ఏడీసీపీ ఎస్.వరదరాజు, ఎస్‌బీ ఏడీసీపీ మహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు.
Advertisement