కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుబోయిన బాబు
ఏపీఎస్‌వైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన, ధర్నా
విజయవాడ (గాంధీనగర్) :ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్ముడుపోయారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన సమాఖ్య (ఏపీఎస్‌వైఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ లెనిన్ సెంటర్‌లో ఏపీఎస్‌వైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్నంగా భిక్షాటన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పళ్లాలు చేతబట్టుకుని బిక్షాటన చేశారు. ధర్నానుద్ధేశించి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్నాయన్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఫీజులను నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు చూస్తోందన్నారు.
ఏ మాత్రం రాజకీయ అనుభవంలేని, ప్రజా సమస్యలు తెలియని కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆయను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి గంటా శ్రీనివాస్ విద్య వ్యవస్థను పరిరక్షించడంలో విఫలమయ్యారన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు, కోశాధికారి తమ్మిన గణేష్, ఉపాధ్యక్షులు యంపల శంకర్, కాసాని గణేష్, కె.ఫణి, జి.రాజేష్, రాము, శివబాబు, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.