
ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్!
విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులకు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసం కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన సర్టిఫికెట్లను ఫోర్జరీ సంతకాలతో...
- తహశీల్దార్, సబ్‌కల్టెర్ సంతకాలు ఫోర్జరీ
- సర్టిఫికెట్‌లో ఇచ్చిన అడ్రస్ బోగస్
- దొంగ సర్టిఫికెట్లతో వ్యాపారం?
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులకు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసం కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన సర్టిఫికెట్లను ఫోర్జరీ సంతకాలతో మరో ముఠా సమకూరుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి బండారం బయటపడింది. విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
వెలుగుచూసిందిలా..
మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ దానం చేసేందుకు కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని సత్య కడ్నీ సెంటర్‌కు వెళ్లారు. తన తండ్రి పేరు మిరియాల కృష్ణప్రసాద్ అని, తాను విజయవాడ సత్యనారాయణపురంలోని తిరుమలశెట్టి వారి వీధిలో (ఇంటి నెం: 23-15-100/ఎ) నివాసం ఉంటున్నామని, తమ ఇంటి యజమాని ముదిగంటి శ్రీనివాస చక్రవర్తి అనారోగ్యంతో ఉన్నందున ఆయనకు స్వచ్ఛదంగా కిడ్నీ ఇస్తున్నానని చెప్పాడు.
ఇందుకు సంబంధించి తహశీల్దార్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని సత్య కిడ్నీ సెంటర్‌కు అందజేశారు. ఆస్పత్రి వారు ఈ సర్టిఫికెట్‌ను వెరిఫికేషన్ కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావ్‌కు పంపించారు. సర్టిఫికెట్‌ను పరిశీలించిన తహశీల్దార్ తన సంతకంతోపాటు సబ్ కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
నాలుగు రోజుల క్రితం వచ్చిన ఈ ఫోర్జరీ సంతకాల సర్టిఫికెట్‌ను గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. అయితే సదరు వ్యక్తి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నందున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తహశీల్దార్‌కు పోలీసులు సూచించారు. దీంతో తహశీల్దార్ శనివారం రాత్రి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అంతా బోగస్..
మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఇంటికి శనివారం రాత్రి ‘సాక్షి’ బృందం వెళ్లి పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ ఇంటి యజమాని టి.రామారావు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తేలింది. ఈ నంబరు గల ఇంట్లో రెండు పోర్షన్లు ఉన్నాయి. పై పోర్షన్‌లో వెంకటేశ్వరరావు, కింది పోర్షన్‌లో గడ్డం కళ్యాణ చక్రవర్తి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనిని బట్టి మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ పేరుతో ఇక్కడ ఎవరూ నివాసం లేరని స్పష్టమైంది.
అయితే.. ఇదే ఇంటి నంబరుపై మిరియాల కృష్ణప్రసాద్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణప్రసాద్, క్రాంతి దుర్గాప్రసాద్ పేర్లతో ఈ ఇంట్లో ఇటీవల కాలంలో ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కింది పోర్షన్‌లో నివాసం ఉంటున్న గడ్డం కళ్యాణచక్రవర్తిని.. ప్రశ్నించగా తాను నాలుగు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఇక్కడ కృష్ణప్రసాద్ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. ఇంటి ఓనర్ హైదరాబాద్‌లో ఉంటారని తెలిపాడు.
ఫోర్జరీ ముఠాకు, కిడ్నీ రాకెట్‌కు లింకు!
ఈ పరిణామాలను పరిశీలిస్తే కిడ్నీ రాకెట్ ముఠాతో కృష్ణప్రసాద్, ఆయన కుమారుడు క్రాంతి దుర్గాప్రసాద్‌లకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాల ముఠాకు, కిడ్నీ రాకెట్ ముఠాకు కూడా సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నీ రాకెట్ ముఠాలో హైదరాబాద్, విజయవాడతోపాటు ఇంకా ఏయే ప్రాంతాల వారు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కలెక్టర్‌కు వివరించిన తహశీల్దార్
తన సంతకం ఫోర్జరీ గురించి తహశీల్దార్ శివరావ్ కలెక్టర్‌కు వివరించారు. ఫోర్జరీ సంతకాల ముఠా ను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.