దొంగల ముఠా అరెస్టు
Published Fri, Aug 23 2013 4:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
టెక్కలి రూరల్, న్యూస్‌లైన్: జల్సాకు అలవాటు పడిన కొందరు యువకులు దొంగతనాలను టార్గెట్ చేసుకున్నారు. పెద్ద స్థాయి దొంగతనాలతో దర్జాగా బతకొచ్చని భావించి ఆయుధాలు సేకరించారు. ఈ దొంగల ముఠా టెక్కలి పోలీసులకు చిక్కింది. వీరి నుంచి రెండు నాటు తుపాకీలు, 5 తుపాకీ గుళ్లు, 3 కత్తులు, బంగారు, వెండి వస్తువులు, మంకీ టోపి, ఒక జత గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అడిషనల్ ఎస్పీ బీడీవీ సాగర్, కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్, టెక్కలి సీఐ రాంబాబు, ఎస్సై శంకరరావుల సమక్షంలో గురువారం విలేకర్ల ముందు హాజరు పర్చారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...టెక్కలికి చెందిన పద్మన పండా, భాస్కర్ బరోడా, బగాది నందా, కాళ్ల వెంకటరమణ, దండాశి బాబ్జి, దాసరి రాంకుమార్, కాయ నాగరాజు, దేవాది సింహాచలం టెక్కలిలో వివిధ పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆర్భాటంగా జీవితాన్ని గడపడానికి దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా చిన్నపాటి పనులు చేసుకుంటూ ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుండేవారు. ఇటీవల కాలంలో టెక్కలి ఆర్డీవో కార్యాలయం వెనుక నివాసముంటున్న ఓ ఆశావర్కర్ ఇంటిలో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు. గ్రైండర్‌తో పాటు బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు. దీంతో అప్రమత్తమైన టెక్కలి పోలీస్ క్రైమ్ సిబ్బంది నిఘా వేశారు. టెక్కలి సాయిదుర్గా వైన్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న వూన గోవిందరావు ఫిబ్రవరి 9వ తేదీన సుమారు రూ.87,500తో రాత్రి సమయంలో తన ఇంటికి బయల్దేరారు.
విషయాన్ని తెలుసుకున్న అదే వైన్‌షాప్‌లో పనిచేస్తున్న దొంగల ముఠాకు చెందిన దేవాది సింహాచలం, కాయ నాగరాజులు సహచర దొంగలకు సమాచారమిచ్చారు. వీరంతా గోవిందరావుపై దాడి చేసి నగదును దోచుకున్నారు. ఈ నేపధ్యంలో క్రైం సిబ్బంది నిఘాను మరింత పటిష్టం చేశారు. ఈ నెల 21న దొంగల ముఠాకు చెందిన పద్మన పండా మండలంలోని తొలుసూరుపల్లి ప్రాంతంలో తుపాకీతో సంచరిస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో వీరు దాడిచేసి పండాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతనివద్ద నుంచి నాటు తుపాకీ, రెండు తుపాకీ గుళ్లు, 3 కత్తులు, ఒక మంకీ టోపి, ఒక జత గ్లౌజు స్వాధీనం చేసుకున్నారు. తోటి సహచరుడు భాస్కర్ బరోడా వద్ద కూడా ఒక నాటు తుపాకీతో పాటు 3 తుపాకీ గుళ్లు ఉన్నాయని పండా తెలిపాడు.
దీంతో భాస్కర్ బరోడాను సీఐ రాంబాబు టెక్కలి మండలం పరశురాంపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయుదాలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని విచారించగా... తమ ముఠాలోని సభ్యుల గురించి మొత్తం విషయాలను తెలిపారు. దీంతో పోలీసులు ముఠా మొత్తాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సంఘటనలు టెక్కలిలో జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న క్రైం సిబ్బంది హెచ్‌సీలు సూర్యనారాయణ, భుజంగరావు, పీసీలు లక్ష్మణరావు, బాలకృష్ణ, ఉమాలకు అడిషనల్ ఎస్పీ సాగర్ నగదు ప్రోత్సాహంతో అభినందించారు. వీరితో సీసీఎస్ సిఐ శ్రీనివాసరావు ఉన్నారు.
Advertisement
Advertisement