
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలోని సుదర్శన్ థియేటర్ సమీపంలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. పరస్పరం బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు..మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. సుదర్శన్ థియేటర్ సమీపంలో ఉన్న రాజా వైన్స్‌లో కొందరు యువకులు గురువారం మధ్యాహ్న సమయంలో మద్యం సేవిస్తున్నారు. వారి పక్కనే స్థానికంగా నివాసముంటున్న మరికొంత మంది యువకులు మరో టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్నారు. ఒక టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్న వారు సిగరెట్ తాగటం మరో టేబుల్ వద్ద కూర్చున్న యువకులకు నచ్చలేదు. వేరే దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగండని చెప్పడంతో రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది.
మాటలతో ప్రారంభమైన గొడవ బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఒకవర్గం యువకులు స్ధానికంగా నివాసముంటున్న వారు కాగా మరోవర్గం యువకులు పక్కనే ఉన్న ఖైజోల గ్రామానికి చెందినవారు. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖైజోల గ్రామానికి చెందిన యువకులను ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో పాల్గొన్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.