మంత్రులకు చంద్రబాబు గ్రేడ్లు
-
శాఖలపై పట్టు, అసెంబ్లీలో వారి వ్యవహార శైలీ పరిగణనలోకి
-
తొలి స్థానంలో దేవినేని, తదుపరి స్థానాల్లో కామినేని, అచ్చెన్నాయుడు
-
యనమల, కేఈలకు దక్కని గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులకు గ్రేడింగ్ ఇచ్చారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు తొలిస్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు తదితరులకు వరుసగా ఆ తదుపరి స్థానాలు దక్కాయి. శాఖలపై మంత్రుల సమీక్షలు, సాధించిన పట్టు, అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, జిల్లాల్లో పర్యటనలు, ప్రజలు..పార్టీ కార్యకర్తలతో సంబంధాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని స్థానాలను నిర్ణయించి నట్టు చెబుతున్నారు.
వంద రోజుల పాలన పూర్తయిన తర్వాత మంత్రులకు గ్రేడింగ్‌లు ఇస్తానని చెప్పిన మేరకు వారి పనితీరుపై ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పార్టీ పరంగా ఆయన కుమారుడు లోకేష్ సమాచారం రాబట్టారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, రోడ్లు, భవనాల మంత్రి రాఘవరావు, పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, పురపాలక మంత్రి పి.నారాయణలు వరుసగా దేవినేని, కామినేని, కింజరాపుల తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ గ్రేడింగ్‌ల్లో సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తిలకు చోటు దక్కకపోవడం గమనార్హం.