సాక్షి, అమరావతి : భూ యజమానులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సాగుదారులందరికీ వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.12,500 సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగుపత్రం మీద సంతకం చేయడం వల్ల రైతులకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా వచ్చే రూ.12,500 కచ్చితంగా అందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లుపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ మేరకు భరోసా ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఏ విషయంలోనూ రైతు భయపడాల్సిన పనిలేదు
‘ఈ బిల్లులోని ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇంత వరకూ ఫలానా వ్యక్తి కౌలు రైతు అని చెప్పడానికి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయడానికి భయపడేవారు. అతన్ని గుర్తించడానికి నిరాకరించేవారు. ఎప్పుడైతే రైతు భయపడతాడో అప్పుడు ఇద్దరూ.. కౌలురైతు, రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం వీరికి సంబంధించి ఏ చట్టమైనా చేయాలనుకున్నప్పుడు కౌలు రైతుకు ఎలా మేలు చేయాలన్న కోణంలో ఆలోచిస్తేనే అందులో స్ఫూర్తి కనిపిస్తుంది. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ చట్టాన్ని తీసుకు వస్తున్నాం. దీంట్లో అతి ముఖ్యమైన కీలకాంశం.. రైతుకు ఎటువంటి నష్టం జరగదు. ఏమాత్రం అభద్రత ఉండదు. ఒక స్టాంప్ పేపర్ కొన్నంత సులభంగా కౌలుపత్రం అందుబాటులో ఉంటుంది. అందులో ఒక భాగం కౌలు రైతుకు సంబంధించినది కాగా, రెండో భాగం రైతుకు సంబంధించినది. మనం ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లో ఈ పత్రం అందుబాటులో ఉంటుంది.
రైతు, కౌలు రైతు.. ఇద్దరికీ మేలు చేస్తున్నాం
రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు ఉన్న భూ విస్తీర్ణం కేవలం 1.25 ఎకరాలు అంటే కేవలం అర హెక్టారు మాత్రమే. దీన్ని ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాల దాకా తీసుకుపోతే 70 శాతం మంది రైతులు ఇందులోకి వస్తారు. వీరందరికీ ఈ పత్రాలు ఇచ్చినందువల్ల రైతులకు ఎటువంటి నష్టం ఉండదు. రైతు భరోసా కింద రూ.12,500 కచ్చితంగా వస్తాయి. అదీ కాకుండా వీరు ఎవరైనా తమ భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కౌలుకు ఇస్తే వారికి కూడా కచ్చితంగా ఈ మేలు అందుబాటులోకి వస్తుంది. ఇద్దరికీ మంచి చేసినట్టవుతుంది. రైతులకు ఎటువంటి అభద్రత ఉండదు. రైతు తన భూమిని తాకట్టు పెట్టుకుని తానేమైనా చేసుకోవచ్చు. భూమి బదిలీ కాదు. కాబట్టి ఇది ఒక విప్లవాత్మక మార్పు కానుంది’ అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
కౌలు రైతు నష్టపోకుండా భరోసా
ఇది చాలా ప్రాథమికమైన పత్రం. ఈ పత్రంలో వారు నింపేది కొన్ని వివరాలు మాత్రమే. భూమి ఎక్కడుంది? ఆ భూమి వివరాలు ఏమిటి? అనేది నింపితే సరిపోతుంది. మిగిలినదంతా స్టాండర్డ్ డాక్యుమెంట్. ఇందులో రైతు భయపడాల్సిన అంశాలు ఏమీ ఉండవు. ఈ పత్రం కేవలం 11 నెలల కాలానికి సంబంధించి అమల్లో ఉంటుంది. ఆ గడువు దాటితే ఈ డాక్యుమెంట్‌కు ఏ విలువా ఉండదు. 11 నెలల గడువు దాటిన తర్వాత భూ యజమాని అయిన రైతు మరో కౌలు రైతును తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. దీనివల్ల రైతు భయపడడు. భూమి మీద హక్కును రైతు ఏమాత్రం కోల్పోడు.
ఇక కౌలు రైతుకు వచ్చే మేలు ఏమిటంటే.. పంట మీద ఉన్న హక్కు మాత్రమే ఆ 11 నెలల కాలానికి బదిలీ అవుతుంది. అంటే ఆ 11 నెలల కాలానికి పంట మీద వచ్చే లాభ, నష్టాలు కౌలు రైతుకు వస్తాయి. చాలా చోట్ల గమనిస్తే పంట నష్టం జరుగుతుంది.. అయినా బీమా అందదు. బ్యాంకు రుణాలు అందవు. రకరకాల పరిస్థితుల్లో కౌలు రైతు నష్టపోతున్న పరిస్థితి. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్ పడుతుంది. ఈ పత్రం మీద సంతకం చేయడం వల్ల రైతుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద వచ్చే రూ.12,500 రాకుండా పోతుందా అంటే అదీ జరగదు. రైతు భరోసా కింద ఆ రైతుకు కచ్చితంగా రూ.12,500 వస్తుంది. కౌలు రైతుల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు చెందిన వారికి వచ్చే అన్ని ప్రయోజనాలే కాకుండా అదనంగా (కౌలు రైతులకు) రైతు భరోసా కింద రూ.12,500 వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment