ధరల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. కలెక్టర్ హెచ్చరికతో ఒక్కరోజు మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు.
నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. అన్ని రకాల నిత్యావసరాలను వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచేస్తున్నారు. రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలకు తెరపడడం లేదు. రైస్‌మిల్లర్లు, రేషన్‌డీలర్లు కలిసి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరిపి ఈ అక్రమాలను నియంత్రించాల్సిన నిఘా విభాగం మాత్రం నిద్రమత్తులో జోగుతోంది. అక్రమ నిల్వలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది. కనీసం నెలకోసారి కూడా తనిఖీలు జరిపిన పాపాన పోవడం లేదు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ధరల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. కలెక్టర్ హెచ్చరికతో ఒక్కరోజు మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. సెప్టెంబర్ 10న జరిగిన ఆహార సలహా సంఘం సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య... నిఘా విభాగం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లతో పోల్చితే ధరలు పెరిగినట్లు ఉన్నా తనిఖీలు, నమోదు చేసిన కేసులు తక్కువగా ఉండడానికి కారణాలు ఏంట ని సమావేశంలోనే జేసీ అరుణ్‌కుమార్ ను, జిల్లా సరఫరా అధికారిని నిలదీశారు. గణాంకాలు కూడా విమర్శలకు తావిచ్చే లా ఉండడంతో ఈ సమావేశంలో జేసీ ఏమీ చెప్పలేకపోయారు. వివరణ ఇచ్చే విషయాన్ని సరఫరా అధికారికి వదిలేసి ఊరుకున్నారు. సరఫరా అధికారి వివరణతో కలెక్టర్ సంతృప్తి చెందలేదు.
రేషన్ డీలర్లు కార్డుదారుల్లో కొందరికి చక్కెర, పామాయిల్ సరిగా ఇవ్వడం లేదని గ్రామ సందర్శనల్లో ఫిర్యాదులు వస్తున్నాయని, తనిఖీలతోనే దీనికి ముగింపు పలుకుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిఘా విభాగం వారు సెప్టెంబరు 12న హడావుడి చేశారు. సైదాపూర్, సుల్తానాబాద్, వెల్గటూరు, జమ్మికుంట మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వలు సీజ్ చేశారు. జిల్లా రెవె న్యూ, నిఘా విభాగంలో చలనం వచ్చింద ని అంతా భావించారు. ఏం జరిగిందో గానీ... ఒక్కరోజుకే తనిఖీలు నిలిపివేశా రు. ఇది జరిగి రెండు నెలలు దగ్గరపడుతున్నా మళ్లీ తనిఖీల జోలికి వెళ్లడం లేదు. అక్రమార్కులపై చర్యల విషయంలో కలెక్టర్ ఆదేశాలను... జేసీ నియంత్రణలో ఉం డే పౌర సరఫరాలు, రెవెన్యూ నిఘా విభాగం వారు అమలు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తనిఖీలు తగ్గుముఖం
జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. బియ్యం ఉత్పత్తిలోనూ రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 500 రైస్‌మిల్లులు ఉన్నాయి. వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రైస్ మిల్లర్లు మాత్రం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంట్లో భారీ గా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజా పంపిణీ బియ్యంలోనూ ఇదే పరిస్థితి ఉం టోంది.
నిత్యావసరాల ధరల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఉల్లిగడ్డలు కిలో కనిష్టధర రూ.50పలుకుతోంది. బియ్యం, పప్పులు, చక్కెర, నూనెల తీరు ఇలాగే ఉంటోంది. రెండేళ్లుగా ధరలమోత మోగు తోంది. ఈ పరిస్థితుల్లో అక్రమ నిల్వలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిన రెవెన్యూ, నిఘా విభాగాలు మాత్రం విధు లు పక్కనబెడుతున్నాయి. అక్రమ నిల్వ లు, ప్రజా పంపిణీలో అక్రమాలు వంటి అంశాల్లో 2012లో జిల్లా వ్యాప్తంగా 320 కేసులు నమోదయ్యాయి. అధికారిక నివేదిక ప్రకారం 2013లో ఆగస్టు వరకు (ఎనిమిది నెలలు) కేవలం 92 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత ఒక్క రోజు హడావుడి చేశారు.
పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో 27 మంది నిఘా సిబ్బంది ఉన్నారు. వీరికితోడు ప్రతి మండలంలో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డెప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉం టారు. వీరంతా నెలకో కేసు నమోదు చేసి నా వీటి సంఖ్య గతేడాది కన్నా దాటిపోయేది. బియ్యం, ఉల్లి... ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నా ఈ ఏడాది తనిఖీలు ఆగిపోయాయి. ఈ ఏడాది కేసుల సంఖ్య గతేడాది సంఖ్యలో సగం కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ఉన్నతాధికారుల ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో ఉన్నతాధికారులకున్న సంబంధాల వల్లే తనిఖీ లు తగ్గాయనే విమర్శలు వస్తున్నాయి.