సొంతగడ్డపై గౌరవం ఇదేనా?
విజయనగరం మున్సిపాలిటీ : క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు ఆ స్థాయిలో గౌరవం దక్కడం లేదు. కనీస సదుపాయాలు లేకున్నా క్రీడారంగాన్నే నమ్ముకుని రాణిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతోంది. ఇందుకు కామన్‌వెల్త్ గేమ్స్‌లో విజేతగా నిలిచిన మత్స సంతోషికి జిల్లా యంత్రాంగం నిర్వహించిన సన్మాన కార్యక్రమమే తార్కాణంగా నిలుస్తోంది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 183 కిలోల బరువు ఎత్తి ప్రపంచస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పిన సంతోషికి జిల్లా యంత్రాం గం ఆధ్వర్యంలో బుధవారం సన్మానం నిర్వహించారు.
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు, క్రీడాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే సంతోషి సన్మాన కార్యక్రమానికి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు కానీ.. క్రీడాకారులు కానీ ఏ ఒక్క రూ హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమానికి జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, కొద్ది మంది వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు, ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. ఈ విషయంలో మిగిలిన క్రీడా సంఘాల ప్రతినిధులు ఎందుకు దూరంగా ఉన్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి సంతోషి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో తొలి కామన్‌వెల్త్ పతకాన్ని అందించింది. ఇంతటి ఘనత సాధించిన మట్టిలో మాణిక్యం పట్ల క్రీడా సంఘాలు చిన్నచూపు చూస్తున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. కేవలం తమ విభాగానికి చెందిన క్రీడాకారులు రాణించినప్పుడే చంకలు గుద్దుకుని సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరికాదని, అంతర్జాతీయ స్థాయిలో ఏ క్రీడాకారుడు రాణించినా అన్ని క్రీడా సంఘాలు సుముచిత రీతిలో అభినందించాలని సర్వత్రా భావిస్తున్నారు.
ప్రోత్సాహకంపై విమర్శల వెల్లువ
నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి అంతర్జాతీయ పతకం అందించిన మత్స సంతోషికి ప్రభుత్వం తరఫున ప్రకటించిన నగదు ప్రోత్సాహకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస సదుపాయాల కల్పన విషయంలో అటు అధికార యంత్రాం గం, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ సంతోషి స్వయంకృషితో ఎదిగింది. అటువంటి క్రీడాకారిణికి కేవలం రూ7.5 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్లు జేసీ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇదే పోటీల్లో బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన మిగిలిన రాష్ట్రాల క్రీడాకారులకు భారీ మొత్తం లో ప్రోత్సాహకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.