ముఫ్పైఏళ్లుగా తపిస్తుంటే ఏర్పాటైన పథకం. పనులు పూర్తయితే ఇంకేం నీటి కష్టాలు తీరినట్లే అనుకున్నారు అలంపూర్ చౌరస్తా వాసులు. కాంట్రాక్టర్ మాత్రం పైపు లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీనితో నీటికి పాత పాటే. అదీ ఇబ్బందుల మధ్యే. ఇప్పుడు కలుషిత జలాలే గత్యంతరం. ఈ అవస్థలు తీర్చే మార్గం కోసం నిరీక్షిస్తున్నారు. నీటి పరీక్షకు తట్టుకోలేక పోతున్నారు.
అలంపూర్, న్యూస్‌లైన్ : ఎన్నో విన్నపాల ఫలితంగా రూపుదిద్దుకున్న కలుగొట్ల తాగునీటి పథకం పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇ వ్వకపోవడంతో అసలు ఉద్దేశం ఆమడ దూ రంలోనే ఉండి పోయింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పనులైతే పూర్తి చేశారు. కానీ కొత్త పైప్‌లైన్‌లకు కనెక్షన్ ఇచ్చి దాని ద్వార నీటిని సరఫ రా చేయాల్సిన బాద్యతలను విస్మరించారు. దీంతో ఎప్పటిలాగే అలంపూర్ చౌరస్తా ప్రజలు, ప్రయాణీకులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఇప్పటి వరకు సరఫరా అవుతున్న నల్లా ద్వార నీళ్లు తెచ్చుకుందామని ఆశించినా పైప్‌లైన్ లీకేజితో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచింది. నిర్వహణ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో చివరకు పుల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్పందించి లీకేజిలకుకక మరమ్మత్తులు చేపట్టడంతో స్థానికులకు ఊరట లభించింది. కానీ కలుషిత నీటి బాధలు మాత్రం ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రూ. 6.50 లక్షలతో అదనపు పైప్‌లైన్
నియోజకవర్గ కేంద్ర బిందువుగా జాతీయరహదారి అడ్డాగా ఉన్న అలంపూర్ చౌరస్తాకు కలుగొట్ల తాగునీటి పథకం నుంచి తాగునీ టిని అందిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం నాలుగు రోడ్ల కూడలిలో ఒక్క వైపు మాత్ర నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో మిగిలిన కాలనీలకు నీటి సరఫరా లేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మిగిలిన రోడ్లలోని కాలనీలకు తాగునీటిని అందించడానికి అనువుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు రోడ్ల కూడలిలోని కాలనీలకు నీటి సరఫరా నిమిత్తం 428 మీటర్ల పైప్‌లైన్ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పాత పైప్‌లైన్ నుంచి కనెక్షన్ ఇస్తే మిగిలిన కాలనీలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్ సాకులను చూపుతూ కనెక్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి నెలకొంది.
అటకెక్కిన బోరు మోటారు ప్రతిపాదన :
అలంపూర్ చౌరస్తాలో పథకం నుంచి నీటి సరఫరా నిలిచిన సమయాల్లో ప్రత్యేక నిధులతో ప్రత్యాయ్నాంగా బోరు మోటారు వేయాల్సి ఉంది. ఇక్కడ ఫోరైడ్ నీళ్లు పడుతాయని బోరు వేసే ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే వేసవిలో స్థానికులకు తాగునీటి కష్టాలు తప్పవని అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చౌరస్తాకు సమీపంలోనే ఎక్కడో ఒక చోట బోరు మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే నీటి కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంపును పరిశీలించిన జేఈ
గత కొంత కాలంగా కలుషిత నీరు సరఫరా అవుతోందని, కొత్త పెప్‌లైన్‌కు కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆర్‌డబ్లుఎస్ జేఈ కృష్ణయ్య మంగళవారం అలంపూర్ చౌరస్తాలో చేసిన పైప్‌లైన్ పనులను పరిశీలించారు. సంపులో కలుషితమైన నీటి గురించి స్థానికులు వివరించారు. సంపు భూమికి సమాంతరంగా ఉండంతో కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు, పురుగులు అందులో పడి నీరు కలుషిత మవుతున్నట్లు వెల్లడించారు. పాత పైప్‌లైన్ లీకేజిల కారణంగా గత ఐదు రోజులుగా నీళ్లు బందయినా నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి నిరంతరంగా నీటి సరఫరా చేయాలని కోరారు.
‘కలుగొట్ల’...ఎప్పట్లా..!
Published Wed, Dec 25 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement