'విలీనంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు'
హైదరాబాద్ : విలీనం విషయంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కేసీఆర్తో ఎలాంటి ఒప్పందం జరగలేదని... అయితే భవిష్యత్లో ఒప్పందం జరగవచ్చని అన్నారు.
చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు కోసం ఆపార్టీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని పాల్వయి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీకి పుట్టగతులు ఉండవంటూ విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పాల్వాయి ముఖ్యమంత్రిపై కూడా ధ్వజమెత్తారు. సీఎంకు మతిభ్రమించిందని మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజాప్రతినిధుల్ని రెచ్చగొట్టి పార్టీని బలహీనపరుస్తున్నారని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును తెలంగాణ ప్రాంతం ఆమోదించదని పాల్వాయి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.