
‘మాఫీ’ తిప్పలు
కలెక్టరేట్ వద్ద రోజంతా క్యూలో రైతుల నిరీక్షణ
ఆధారాలు ఇచ్చేందుకూ ఇబ్బందులే
మహారాణిపేట : రుణమాఫీ అవుతుందనే ఆశతో ఇప్పటికీ చాలామంది రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రోజుల తరబడి వ్యవసాయ పనులు మానుకొని నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అడిగినప్పుడల్లా జెరాక్స్ కాపీలు ఇస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం ఏదో సాకు చెప్పి రుణమాఫీ మాత్రం కాకుండా చేస్తున్నారు. రుణమాఫీ అవ్వని రైతుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కలెక్టరే ట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రీవెన్స్‌కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చారు. గ్రీవెన్స్ కౌంటర్ తెరవకముందే భారీ క్యూ కట్టారు. కొంతమంది జెరాక్స్‌ల కోసం ఎండలో తిరుగుతూ కనిపించారు. వీరిలో ఎవరిని కదిలించినా మాకు రుణమాఫీ వర్తించలేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆధార్ కార్డుంది.. రేషన్ కార్డూ ఉంది.. రుణం తాలూకా బ్యాంక్ కార్డు ఉంది. ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులన్నింటికీ మేము అర్హులమే. అయినా బ్యాంక్ అధికారులు ఏదో సాకు చెప్పి మమ్మల్ని రోజూ తిప్పుతున్నారు తప్ప మాఫీ మాత్రం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆధార్ ఎంటర్‌కాలేదట
ఆధార్ కార్డు నెంబర్ ఎన్నిసార్లు ఇచ్చినా కంప్యూటర్‌లో ఎంటర్ కావడం లేదట. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా నా పేరు మీద ఆధార్ ఎంటర్ కావడం లేదనే అధికారులు చెప్తున్నారు. నేను నర్సీపట్నం ఏడీబీ బ్యాంకులో రూ. 34 వేలు లోన్ తీసుకున్నా ను. అప్పుడు ఆధార్‌కార్డు లేకుండానే లోన్ ఇచ్చారు. ఇప్పుడు రుణమాఫీ కోసం ఆధార్‌కార్డు అడిగితే ఆధార్‌కార్డు చేయించుకున్నాను. ఆ నెంబర్ ఇస్తే ఎంటర్ అవడం లేదని రుణమాఫీ ఆపేశారు. - సేనాపతి రామారావు, చెట్టుపల్లి, నర్సీపట్నం మండలం
పేరులో తప్పుందన్నారు..
అనకాపల్లి ఏడీబీ బ్యాంకులో 2013లో రూ. లక్ష రుణం తీసుకున్నాను. ఆ రోజు నాకు కరణం నాగ జమున అనే పేరు మీద రుణం ఇచ్చారు. నా రేషన్ కార్డు, ఆధార్ కార్డులో మాత్రం కరణం జమున అని ఉంది. ఇప్పుడు రుణమాఫీ కోసం అడిగితే నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేరు తప్పుపడింది. వాటిని మార్పించుకో అని చెప్పారు. అయితే నా దగ్గరున్న ఆధార్‌కార్డు, రేషన్ కార్డు ప్రకారం బ్యాంకులో నాగజమునకు బదులు జమున అని మార్పించుకున్నాను. తరువాత మా ఆయన పేరు వెంకటరావుకు బదులు వెంకటరమణ అని బ్యాంక్ వారు ఇచ్చిన రుణఖాతాలో పడింది. దాన్నీ మార్పించుకున్నాను. ఇప్పుడు ఆ ఆధారాలన్నింటితో ఇవ్వడానికి వచ్చాను.
- కరణం జమున, మాటూరు, అనకాపల్లి మండలం