డోన్, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సాగునీటి కష్టాలు ఎక్కువవుతాయని వైఎస్‌ఆర్‌సీపీ డోన్ నియోజకవర ్గసమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావం పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సుయాత్ర గురువారం డోన్‌కు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచే కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తాయని.. వీటిపై ఆనకట్టలు కడితే కిందనున్న ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు. కృష్ణా జాలాలపై ఆధారపడి జీవనం సాగించే రాయలసీమ ప్రాంతం పూర్తిగా కరవుకోరల్లో చిక్కుకుంటుందని చెప్పారు. ఇవ్వన్నీ తెలిసి కూడా.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు తమ పదవులు పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. వీరంతా రాజీనామా చేసి కేంద్రంపై వత్తిడి పెంచి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేది కాదని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీరామారావు ఆనాడు కృషి చేస్తే.. నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఆ గౌరవాన్ని మంటకలిపారని ఆరోపించారు.
చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. నాడు కర్నూలు రాజధానిని త్యాగం చేశామని, నేడు హైదరాబాద్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని పేర్కొన్నారు. రాజధాని నగరం ఒక్కరి సొత్తుకాదని, అన్ని ప్రాంతాల ప్రజలు దానిని అభివృద్ధి చేశారనని వివరించారు. సమైక్యాంధ్ర కోసమే షర్మిల బస్సుయాత్ర చేపట్టారని, ఆమె అడిగే ప్రశ్నలకు చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. అనంతరం నాగలిని షర్మిలకు బహూకరించారు. బస్సుయాత్రలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, శ్రీరాములు, రామకృష్ణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, బాబుల్‌రెడ్డి, బోరెడ్డిశ్రీరామిరెడ్డి, చిట్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో సాగునీటి కష్టాలు
Published Fri, Sep 6 2013 3:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement