డీఎస్ గారూ... నన్ను నరసింహన్ అంటారండీ!
నారాయణ గారూ.. మీతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది!
దత్తాత్రేయగారు చాలా మంచి వారు.. ఉన్నదున్నట్లే మాట్లాడతారు!
- గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం ‘ఎట్ హోం’ పేరిట ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో అక్కడికి వచ్చిన కొందరు అతిధులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన సరదా వ్యాఖ్యలివి.
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతుల తేనీటి విం దుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, సినీ, సాహిత్య కళాకారులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌లు ప్రతి ఒక్కరి టేబుల్ వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరిస్తూ, సరదాగా జోక్‌లేస్తూ, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు సీఎంను వెంటతీసుకెళ్లి తన మిత్రులను, క్లాస్‌మేట్లను పరిచయం చేశారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఒకేచోట నిలబడి మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చి న నరసింహన్ డీఎస్‌ను ఉద్దేశించి ‘‘అయ్యా... నేను మీకు గుర్తున్నానా? నన్ను నరసింహన్ అంటారు. ఎప్పుడో 2, 3 నెలల కిందట కలిశాను. బాగున్నారా?’’ అని అన్నారు. దీంతో డీఎస్ ‘‘ఎంత మాట... మాఫ్ కీజియే’’ అంటూ చెంపలేసుకుంటున్నట్లు చేతులు కదిలించడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
ఆ వెంటనే నరసింహన్ నారాయణను ఉద్దేశించి.. ‘‘నారాయణ గారూ... నేను గుర్తున్నానా? అయినా మీతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. మీ పక్కనున్న దత్తాత్రేయ గారిని చూడండి. ఎంత మంచివారో! ఏదైనా సరే ఉన్నదున్నట్టే మాట్లాడతారు. బయట చేసే రాజకీయాలు వేరనుకోండి’’ అంటూ చమత్కరించారు.
అంతకుముందు తన క్లాస్‌మేట్స్ వద్దకు వెళ్లిన గవర్నర్ వారిని సీఎంకు పరిచయం చేశారు.
తెలంగాణ మంత్రుల డుమ్మా...
రాజ్‌భవన్‌లో జరిగిన తేనేటి విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా తెలంగాణ మంత్రులంతా గైర్హాజరయ్యారు.
స్పీకర్‌తో సీఎం.. సీఎస్‌తో సదారాం ముచ్చట్లు
తేనేటి విందు కార్యక్రమంలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల చాలాసేపు మాట్లాడుకోవడం కనిపిం చింది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజసదారాం కూడా అక్కడికి సమీపంలోని ఓ టేబుల్ వద్ద కూర్చొని మంతనాలు జరిపారు.