పరిగి, న్యూస్‌లైన్: పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుం బంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురై ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన పరిగి మండల పరిధిలోని రావులపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటమ్మ కుమారుడు లక్ష్మయ్య(23)కు ఆరు ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేశాడు. ఎనిమిది నెలల క్రితం అతడు కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్‌కు చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. గతేడాది పొలంలో పత్తి, మొక్కజొన్న సాగుచేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టం వచ్చింది. మూడేళ్లుగా పెట్టుబడి కోసం పరిగి ఏడీబీ (అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంకు) నుంచి రూ. 70 వేలు, కుల్కచర్ల పీఏసీఎస్‌లో రూ.50 వేలతోపాటు ప్రైవేట్‌గా మరో రూ. రెండు లక్షల వరకు అప్పులు చేశాడు.
ఇటీవల డబ్బులు ఇవ్వాలని అప్పులిచ్చిన వారి వేధింపులు అధికమయ్యాయి. ఈక్రమంలో లక్ష్మయ్యకు ఏమీ తోచలేదు. అప్పులు తీర్చేమార్గం కానరాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో ఆయన సోమవారం రాత్రి భోజనం చేసి ఎప్పటిమాదిరిగానే పొలానికి కాపలాగా వెళ్లాడు. మంగళవారం ఉదయం ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలానికి వెళ్లి చూశారు. లక్ష్మయ్య ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. లక్ష్మయ్య మృతితో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తెలిపారు.
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
Published Wed, Sep 25 2013 3:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement