చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం నుంచి వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేసి సమ్మె చేస్తున్నట్లు జిల్లా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, కిషోర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని ఓ హోటల్‌లో ఫెడరేషన్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆలిండియా సంఘం పిలుపులో భాగంగా తాము సమ్మెలోకి వెళుతున్నామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీర్ఘకాలంగా పరిష్కరించడం లేదన్నారు. పలుమార్లు చర్చించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళుతున్నట్లు వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్స్‌పై ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌సపై ఒత్తిడి తెస్తోందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ గైడ్‌లైన్‌స 2001లో రూపొందించారన్నారు. మార్కెటింగ్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు లక్షల కొద్దీ అపరాధం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్‌లైన్‌స సరళతరం చేసే వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకూడదని నిర్ణయించామన్నారు. అంతేగాక ఆధార్ సీడింగ్ వల్ల తమపై అదనపు భారం పడిందని, సబ్సిడీ రాకపోయినా వినియోగదారులు తమను బాధ్యులుగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి భాస్కరయ్య, జిల్లాలోని అన్ని కంపెనీల గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.
నేటి నుంచి గ్యాస్ బంద్
Published Tue, Feb 25 2014 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement