సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సోమవారం జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు తెరుచుకోకపోతే వాటి స్థానంలో వీవీప్యాట్ల స్లిపులను లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఈవీఎంకు సంబంధించి బ్యాటరీ రీప్లేస్‌మెంట్, కంట్రోల్ యూనిట్ మరమ్మతులు సాధ్యం కానప్పుడు వీవీప్యాట్లను లెక్కిస్తామన్నారు. లెక్కింపు సమయంలో మొరాయించిన ఈవీఎంలను పక్కకు పెట్టి మిగిలిన ఈవీఎంలతో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామన్నారు. చివర్లో మొరాయించిన ఈవీఎంల పరిస్థితి పరిశీలించి కేంద్ర పరిశీలకులు, ఆర్వో తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఓట్ల లెక్కింపులో ఫారం 17సీ అత్యంత కీలకమైనదని, ఈ ఫారంలోని వివరాలతో సరిపోలితేనే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు.
కౌంటింగ్‌కు ముందు మాక్‌పోల్ నివేదిక లెక్కలు కూడా సరిపోవాలన్నారు. ఒకవేళ మాక్‌పోల్ ఓట్లు తొలగించకుండా అంటే సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగించి ఉంటే పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లను తొలగించి లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలాగే సీఆర్సీ చేయని వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఐదు ఎంపిక చేసే ర్యాండమైజేషన్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీ ఆధారంగా ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని, ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉండి మెజార్టీ స్వల్పంగా ఉంటే ఆర్వో, కేంద్ర పరిశీలకులు రీ–కౌంటింగ్‌కు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఈ రీకౌంటింగ్‌లో మొత్తం ఈవీఎంలు చేయాలా లేక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లకే పరిమితం చేయాలా అన్నది కూడా వారే నిర్ణయిస్తారన్నారు.
సీఎం వ్యాఖ్యలపై ఖండన
కౌంటింగ్ ఏజెంట్లకు 17సీ ఫారంలు ఇవ్వడం లేదని, కనీస ఆహార ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ద్వివేది ఖండించారు. కౌంటింగ్ హాల్‌లో ఎన్ని టేబుళ్లు ఉంటే అంత మంది ఏజెంట్లను అనుమతిస్తామని, అలాగే ఏజెంట్లకు 17సీ ఫారం కూడా తప్పకుండా ఇస్తామన్నారు. అలాగే ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment