విజయనగరం కంటోన్మెంట్: సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే మా పై కేసులు బనాయిస్తారా?పెట్టుకోండి ! ఏం చేసినా ఈ రోజు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని బలిజిపేట మండలం పెద్దింపేటలో పోలీసులు, అధికారులను ప్రజలు నిలదీశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు సమస్యలను పరిష్కరించని గ్రామసభలెందుకని అడుగడుగునా అధికారులను ప్రశ్నించారు. పెద్దింపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరామని అయినా ఏర్పాటు చేయలేదనీ నిలదీశారు.
ఇప్పుడు మాకు పండిన ధాన్యం కళ్లాల్లో నిల్వలు ఉండిపోయాయని, ఇప్పుడేం సమాధానం చెబుతారని, పెట్టుబడులకు చేసిన అప్పులు తీరేదెలా అని అధికారులను ప్రశ్నించారు. ఈ రోజు ఏదో ఒకటి తేల్చకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లనీయబోమని భీష్మించారు. దీంతో ఎస్సై వై సింహాచలం వచ్చి మీరు అధికారులను నిలదీసి ప్రశ్నిస్తే కేసులు పెడతామని అనడంతో వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించాలని కోరితే మాపై కేసులు బనాయిస్తారా? పెట్టుకుంటే కేసులు పెట్టుకోవాలని మా సమస్యలు తీరాలి కదాఅని పట్టుబట్టారు. చివరకు ఎంపీడీఓ ఇచ్చిన హామీ మేరకు వారిని విడిచిపెట్టారు.
పాత సమస్యలు తీర్చకుండా సభలెందుకు?
పార్వతీపురం మండలం ములగాం, కవిటి భద్ర గ్రామాల్లో సమస్యలు తీర్చకుండా కొత్తగా గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని నిలదీశారు. బొబ్బిలిలోని 8వ వార్డులో అమ్మిగారి కోనేరు చెరువుగట్టు పై నివాసం ఉంటున్న వారికి మరుగుదొడ్లు ఎందుకు నిర్మించలేదని మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించామని అధికారులు, నాయకులను నిలదీశారు. కురుపాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సాదాసీదాగా గ్రామసభలు ముగిశాయి.
వారిని ఎవరెన్నుకున్నారు?
నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీల ప్రమేయం లేకుండానే జన్మభూమి కమిటీ సభ్యులు రేషన్ కార్డులు మంజూరు చేశారని జెడ్పీటీసీ గదల సన్యాశినాయుడు అధికారులను నిలదీశారు. ఒకానొక దశలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రజా ప్రతినిధులంటే అంత చులకనా? జన్మభూమి కమిటీ సభ్యులను ప్రజలెన్నుకున్నారా? దీనిపై మీరు వెంటనే సమాధానం చెప్పకపోతే ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదని అనడంతో అధికారులు అవాక్కయ్యారు. తహశీల్దార్ విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సాలూరు నియోజకవర్గంలో సాదాసీదాగా సభలు జరిగాయి. భోగాపురం మండలం దళ్లిపేటలో గ్రామసభను బహిష్కరించారు. రేషన్ కార్డులను తీసుకోలేదు. మా భూముల్లో విమానాశ్రయం నిర్మించేందుకు భూములు, ఇళ్లు లాక్కుని ఇబ్బందులు పెడుతున్నారని తామెందుకు గ్రామసభలకు హాజరవుతామంటూ వారు ఇళ్లలోనే ఉండిపోయారు. కొత్త వలస మండలం పెదరావుపల్లిలో రేషన్ డిపోల్లో రేషన్ సరుకులు ఇవ్వ డం లేదు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జన్మభూమి సభల్లో ప్రజలు నిలదీతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రశ్నల పరంపర
Published Thu, Jan 7 2016 12:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement