గిరిజన వర్సిటీ తరలింపు బాధాకరం
జియ్యమ్మవలస:జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించడం బాధాకరమని కురుపా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మం డలంలోని చినమేరంగి గ్రామంలో తన స్వగృహంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, ప్రస్తుతం మాట తప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామంటే ఈప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రస్తుతం తరలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. జిల్లా నుంచి ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని వారంతా పట్టించుకోక పోవడం వింతగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మాటలే తప్ప చేతలు లేవన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హమీలను నెరవేర్చి గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఈ జిల్లాలోనే స్థాపించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు.
నాయకులకు బుద్ధి చెబుతాం: గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన నాయకులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ సురేష్, కె నాగేశ్వరరావులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని వాపోయారు. ఎంతో వెనుకబడ్డ ఈ జిల్లా గిరిజన యూనివర్సిటీ రాకతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుతుంటే గిరిజనులు మాత్రం ప్రాథమిక విద్యకు కూడా నోచుకోకుండా ఇక్కడే గిరిగీసినట్టుండిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గిరిజనులు సొంత కాళ్ల మీద నిలబడడానికి ఉన్నత విద్యలు అవసరమని, అందుకు ఈ గిరిజన విశ్వవిద్యాలయం వస్తే ఎంతో అనుకూలంగా ఉండేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును జీర్ణించుకోలేకపోతున్నామని అందుకోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే విశాల ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు.