
శవంగా మారిన మోక్షజ్ఞను చూసి విలపిస్తున్న మరో బాబాయి చంద్రశేఖర్
గుంటూరు: తెనాలికి చెంది చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసులో బాబాయి హరిహరన్ను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా హరిహరన్ మాట్లాడుతూ తన తండ్రి రాంబాబు తనపై ప్రేమ చూపించడంలేదన్న కసితోనే మోక్షజ్ఞను హతమార్చినట్లు చెప్పాడు. మోక్షజ్ఞ తేజ మృత దేహం కృష్ణానదిలో దొరికిన విషయం తెలిసిందే.
ఈ కేసు పూర్వాపరాలు.... తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడ్డారు. మూడవ కుమారుడు హరిహరన్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ తేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడు హరిహరన్కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరన్ గత నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు.
రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు వచ్చిన రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరన్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు వారధిపై కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న హరిహరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, తన బిడ్డను తండ్రి, కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ప్రియ ఆరోపించారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి ఉందని ఆమె చెప్పారు. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ''జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు.నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా? బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారు. నా బిడ్డ జాతకంలో తండ్రికి ప్రాణహాని ఉందని ఎవరో సిద్ధాంతి చెప్పారట. నా బిడ్డ కనిపించకుండా పోతే ఒక రోజంతా నాకు తెలియకుండా చేశారు. నేను తెనాలి వచ్చి చూసేంత వరకూ ఆ విషయాన్ని దాచారు. నేనూ, నా బిడ్డ వారికి అడ్డుగా ఉన్నామని చెబితే వారి జీవితాల్లోంచి వెళ్ళిపోయేదాన్ని. అంతేగాని ఇంత ఘాతుకానికి తెగబడి నాకు కడుపుకోత మిగులుస్తారా? నా బిడ్డ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారనే విషయాలు బయటకు రావాలి'' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భాస్కరరావుతో పెళ్ళైనప్పటి నుంచి ఆయన జాతకాల పిచ్చికి ఎన్నోసార్లు గొడవలు జరిగాయని ఆమె చెప్పారు. పెళ్లయిన కొత్తలో మామకు ప్రమాదం జరిగితే, తనను పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందంటూ వేధించాడని చెప్పారు. అయినా పట్టించుకోకుండా ఇన్నాళ్లూ కాపురం చేశానని తెలిపారు. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
కన్న బిడ్డ చనిపోవడంతో తమ కోడలు షాక్‌కు గురైందని విమల మామ రాంబాబు చెప్పారు. షాక్ వల్లే అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటున్నానన్నారు. తమ కోడలు విమలప్రియ మంచిదేనని చెప్పారు. ఆమె అలా మాట్లాడినందువల్ల తానేమీ బాధపడటం లేదన్నారు. తన కొడుకు హరిహరన్పై కేసు నమోదు చేయమని పోలీసులకు నిజాయతీగా చెప్పానని ఆయన తెలిపారు.