జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనానికి హైపవర్‌ కమిటీ | High Power Panel To Study GN Rao Committee And BCG Reports | Sakshi
Sakshi News home page

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనానికి హైపవర్‌ కమిటీ

Published Sat, Dec 28 2019 3:41 AM | Last Updated on Sat, Dec 28 2019 3:41 AM

 High Power Panel To Study GN Rao Committee And BCG Reports  - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌  అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్‌ ముందుంచారు. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌లతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్‌ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని మీడియాతో తెలిపారు. ఆ వివరాలు ఇలా..

చంద్రబాబు హయాంలో జరిగిందిదీ..
‘2015లో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైన కలల రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని దేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను విస్మరించి అప్పటి మంత్రి నారాయణ బృందం ఇచ్చిన రిపోర్టును ఆమోదించింది. 2015–16లో రైతుల నుంచి 33 వేల ఎకరాలు, అసైన్డ్‌ లేదా ప్రభుత్వ, బంజరు భూమి 21 వేల ఎకరాలు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించింది. ఆ భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. 2 కోట్ల వంతున సుమారు రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసింది.  40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే అప్పటి పాలకులు అయిదేళ్ల పాలనలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

అందులో అప్పట్లో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1,500 కోట్లు కాగా, రూ.4 వేల కోట్లకుపైగా నెలకు వందకు రూ.1.10 నుంచి రూ.1.15 వడ్డీతో అప్పు తెచ్చారు. ఈ అప్పునకు ఏటా వడ్డీ రూపంలో ప్రభుత్వం రూ.570 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని గొప్పగా చెప్పిన అనుభవమున్న అప్పటి ముఖ్యమంత్రి.. మౌలిక సదుపాయాల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేసి అయిదేళ్లలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అలాంటప్పుడు అనుభవం లేని, వాస్తవ దృక్పథం గల మనమేమి చేయాలని ఎవరైనా ఆలోచించాలి కదా? ఈ పరిస్థితిలో మౌలిక సదుపాయాల కల్పనకే  రూ. 1.10 లక్షల కోట్లు వెచ్చించాలంటే.. కలల రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందనే అంశంపై మంత్రివర్గం వాస్తవ దృక్పథంతో చర్చించింది.

రాష్ట్ర అవసరాల మాటేమిటి?
అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 6 నెలల క్రితం పాత్రికేయులతో మాట్లాడుతూ.. తేగలిగినంత అప్పు మేమే తెచ్చాం. ఇక వీరికి ఎవరు అప్పు ఇస్తారు? అని అన్నారు. రూ.25 వేల కోట్లో రూ.50 వేల కోట్లో అప్పు తెచ్చుకుందామనుకున్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో శంకుస్థాపనలు చేసిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.25 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. స్కూళ్ల మరమ్మతులకు రూ.12 వేల కోట్లు, అధ్వానంగా ఉన్న ఆస్పత్రుల బాగుకు రూ.14 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్య అవసరాలు తీర్చడం కోసం రూ.3,150 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీరివ్వడం కోసం సాగునీటి ప్రాజెక్టులకు వెరసి మరో లక్ష కోట్ల రూపాయలు అవసరం.  అమ్మ ఒడికి ఏటా రూ.6 వేల కోట్లు, రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం ఏటా రూ.9 కోట్ల చొప్పున 5 ఏళ్లకు రూ.45 వేల కోట్లు కావాలి.

రక్షిత నీరు లేని దుస్థితి..
గుక్కెడు రక్షిత మంచి నీటి కోసం ప్రజలు తపిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో సురక్షితంకాని నీరు తాగి ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్‌ గ్రిడ్‌ కోసం రూ.40 వేల కోటు, గిరిజన, బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.35 వేల కోట్లు కావాలి. పేదలకు సబ్సిడీ బియ్యం సరఫరాకు ఏటా రూ.10 వేల కోట్లు, పేదల విద్యాభివృద్ధికి ఏటా రూ.6 వేల కోట్లు అవసరం. చదువు ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని మా  ప్రభుత్వం నమ్మింది. అందుకే సంపూర్ణమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది. ఇవే కాకుండా రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం వాటా పోను రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. రోడ్ల నిర్మాణం చేపట్టాలి. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పేదలకు మౌలిక వసతులు కల్పించాలి. మా ప్రభుత్వం వ్యవసాయానికి పగలే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా మరో రూ.3 వేల కోట్లు కావాలి. ఈ విషయాలన్నింటినీ మంత్రి మండలి సమగ్రంగా చర్చించింది.

మరి రాజధాని నిర్మాణం ఎలా?
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలి. ఇవన్నీ వదిలి ఈ కలల రాజధానిని ఇక్కడ ఎప్పటికి నిర్మించగలం? ప్రజా సంక్షేమాన్ని, బాగోగులను, మౌలిక సదుపాయాల కల్పనను, పేదల చదువు, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితే వస్తే హైదరాబాద్‌తోనో, బెంగళూరుతోనో, చెన్నైతోనో ఎప్పటికి పోటీ పడగలం? అనేది సమగ్రంగా మంత్రిమండలి చర్చించింది. విస్తృత చర్చ, మంత్రుల తర్జనభర్జనల అనంతరం జీఎన్‌రావు కమిటీ నివేదిక, రాబోయే బీసీజీ నివేదిక రెండింటి అధ్యయనం కోసం హైపవర్‌ కమిటీ వేయాలని నిర్ణయించింది. అందులో నిపుణులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన మార్గదర్శకాల గురించి చర్చించాం.

రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేదు
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజధాని మారుస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చి స్తాం. మా ప్రభుత్వం ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది. జర్నలిస్టులపై దాడి జరిగిందని చెబుతున్నారు.. దాడి గురించి ఎవరైనా రాసిస్తే హోం మంత్రి, డీజీపీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం. దాడి జరిగినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. రాజధాని ప్రాంతంలోని రైతులే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మా అధినేత ఆశయం. ఊహాజనితమైన కలల వల్ల కొందరు వ్యథ చెందుతున్నారనేది వాస్తవం. వారి ఆందోళన, దిగులు, బాధ పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తాం. మాది అమానవీయ ప్రభుత్వం కాదు. ఆదుకునే సర్కారు’ అని మంత్రి పేర్ని నాని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement