లోకాయుక్త అక్షింతలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కళ్లు తెరిచింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోకాయుక్త అక్షింతలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కళ్లు తెరిచింది. చెరువులు ఉన్నాయా? ఉంటే అవెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువుల స్థితిగతులు, వాటి వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌కు లేఖ రాసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో మాస్టర్ డేటా బేస్ ఆధారంగా 2,857 చెరువులు ఉన్నట్లు లెక్కతీసిన అధికారులు.. వాటి వివరాలను జిల్లా యంత్రాంగానికి పంపారు. రికార్డుల్లో ఉన్నవాటిలో సగం వరకు అన్యాక్రాంతం కావడం, కొన్ని చోట్ల చెరువులు ఉన్నప్పటికీ రికార్డుల్లేకపోవడాన్ని హెచ్‌ఎండీఏ గుర్తించింది.
ఈ నేపథ్యంలో చెరువులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని తమకు పంపాలని నివేదించింది. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీనాటికి చెరువుల పరిరక్షణకు లోకాయుక్త గడువు విధించడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి భాగంలో 455 చెరువులు, ఔటర్ అవతల 2402 జలవనరులు ఉన్నట్లు హెచ్‌ఎండీఏ రికార్డులు స్పష్టం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం వాటిలో పలు చెరువుల అక్రమార్కుల చెరల్లోకి వెళ్లాయి.