
వీళ్లకా పార్టీలో చోటు?: అయ్యన్న
నర్సీపట్నం : పరిటాల రవితోపాటు, 150 మంది టీడీపీ కార్యకర్తల హత్యకు కారకుడైన జేసీ దివాకరరెడ్డికి పార్టీలో చోటెలా కల్పిస్తారో తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం జోగినాథునిపాలెంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో టీడీపీ కార్యకర్తల వరుస హత్యలకు జేసీయే బాధ్యుడని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. పార్టీలో కొంతమంది వ్యక్తులు ప్యాకేజీలకు పడిపోయి మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌రావు బృందానికి స్వాగతం పలికారని దుయ్యబట్టారు.
అవినీతిపరులైన గంటా, ఎమ్మెల్యే కన్నబాబు లాంటి వ్యక్తులను చేర్చుకుంటే పార్టీలో విలువలు ఏం ఉంటాయని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఇనుము దొంగిలించి అక్రమంగా పోగేసిన దొంగ గంటా అని ధ్వజమెత్తారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చంద్రబాబును పక్కనపెట్టి చిరంజీవితో జతకట్టి ప్రజారాజ్యంలో చేరారని, మంత్రి పదవి పొందాక సొంత పనుల కోసం కిరణ్‌తో రాసుకుపూసుకు తిరిగారని దుయ్యమట్టారు.
మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించిన గంటాను పార్టీలో చేర్చుకోవడం బాధాకరంగా ఉందన్నారు. చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాసరావులకు తెలుగుదేశం పార్టీ జెండా గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దీనిపై అధినేత ఆలోచించాలని, ఈ విషయమై పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడా మాట్లాడినట్టు ఆయన వివరించారు.