సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని వంటి పోలవరం ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తోంది. పనులు నత్తనడకన సాగుతుంటే.. అవినీతి, కమీషన్ల వ్యవహారాలు రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు రెండు జాక్‌పాట్‌లు కొట్టేలా సర్కారు పెద్దలు వ్యూహం రచించారు. అవేమిటంటే.. పోలవరం జలాశయంలో కాంక్రీట్ పనులను నవయుగకే నామినేషన్ పద్ధతిలో అప్పగించడం. కేంద్రం కళ్లకు గంతలు కట్టి దీన్ని ఓకే చేయించుకున్నారు. ఇక పోలవరం జలాశయం పనులు 2019 నాటికి పూర్తవుతాయనే భ్రమ కల్పించడం ద్వారా ఆర్థికశాఖ అభ్యంతరాలకు చెక్ పెట్టి... రూ.5,338.95 కోట్ల విలువైన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లను అదే సంస్థకు కట్టబెట్టడానికి చాకచక్యంగా కథ నడిపించడం.. ఈ తతంగం పూర్వాపరాలేమిటో పరిశీలిద్దాం..
నవయుగకే దక్కేలా..
పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు రూ.3,157.93 కోట్లను అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించిన ఏపీ జెన్‌కో(విద్యుదుత్పత్తి సంస్థ) గతేడాది జనవరి 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.. తాను ఎంపిక చేసిన సంస్థకే పనులు దక్కేలా టెండర్లలో ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. గతేడాది సెప్టెంబరు 15న సాంకేతిక బిడ్, అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరిచారు. ముందే అనుకున్నట్లుగానే.. 4.83 శాతం అధిక ధరలకు నవయుగ, 12.92 శాతం అధిక ధరలకు మేఘ, 14.85 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ టాటా పవర్ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు చేసి ‘నవయుగ’ ఎల్–1గా నిలిచింది.
టెండర్లు ముగిశాక అంచనా పెంపు..
టెండర్ల ప్రక్రియ ముగిసి.. నవయుగ సంస్థకు పనులు దక్కాక అంచనా వ్యయం పెంచాలంటూ సర్కారు పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తాళలేని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అంచనా పెంచేశారు. 2016–17 ధరల ప్రకారం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును జీఎస్టీ, లేబర్ సెస్ వంటి పనులతో కలిపి రూ. 3,903.81 కోట్లకు పూర్తి చేయవచ్చని ప్రతిపాదించారు. అక్కడితో సంతృప్తి చెందని చంద్రబాబు అంచనా వ్యయం మరింత పెంచాలంటూ వత్తిడి తెచ్చారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న సమయంలో పెట్టుబడిపై వడ్డీతో కలిపి అంచనా వ్యయం రూ.5,358.23 కోట్లకు అధికారులు పెంచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయం రూ. 1454.42 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్‌ఈసీ (రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్) రూ.3,965.11 కోట్ల రుణం ఇచ్చిందని, మిగతా రూ.1,373.84 కోట్లను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని జెన్‌కో వివరించింది.
ఆర్థిక శాఖ అభ్యంతరాలు..
జెన్‌కో ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో తక్కువ వడ్డీకే రుణం లభ్యమవుతున్నప్పుడు.. ఆర్‌ఈసీ వద్ద 10.95 శాతం అధిక వడ్డీకి రుణం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు లేవని.. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని.. అధిక వడ్డీ భారం పడుతుందని అభిప్రాయపడింది. టెండర్ల ప్రక్రియ ముగిశాక ఐబీఎం, అంచనాల పెంపుపై అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతోనూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తోనూ సంప్రదింపులు జరిపామని, డిసెంబర్, 2019 నాటికి పోలవరం జలాశయం పనులు పూర్తవుతాయని ఆర్థిక శాఖకు జెన్‌కో వివరించింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ఏప్రిల్, 2021 నాటికి.. 12 యూనిట్లు అక్టోబర్, 2022 నాటికి ఉత్పత్తి చేసేలా పనులను పూర్తి చేస్తామని తెలిపింది. జెన్‌కో వివరణలపై అధ్యయనం చేసిన ఆర్థికశాఖ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులను పూర్తి చేయడం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ అమలుపై సందేహాలు వ్యక్తం చేసింది. జలాశయం పనులు సకాలంలో పూర్తి కాకపోతే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
అభ్యంతరాలే అస్త్రాలు..
పీపీఏ, ఆర్థిక శాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలనే అస్త్రాలుగా మల్చుకుని.. మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు. పోలవరం జలాశయం పనుల్లో రూ.1,483.22 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే.. వాటిని రద్దు చేసి రూ.2,800 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టాలని నిర్ణయించారు. జలాశయం పనులు చేస్తున్నదన్న సాకు చూపి అదే సంస్థకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులను కూడా కట్టబెడుతూ టెండర్లను ఖరారు చేయాలన్నది సర్కారు పెద్దల ఎత్తుగడ. ఇక ఐబీఎంను పెంచడం ద్వారా టెండర్ల సమయంలో నవయుగకు రూ.1454.42 కోట్ల లబ్ధి చేకూర్చడమే కాక పట్టిసీమ ‘బోనస్’ వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయడానికి పూనుకున్నారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో ప్రతి నెలా నిర్దేశించిన పని కంటే అధికంగా చేస్తామని.. అధికంగా చేసిన పని విలువలో 50 శాతం బోనస్ ఇవ్వాలని నవయుగ సంస్థతో ప్రతిపాదింపజేశారు. చేసిన పనులకు 30 రోజుల్లోగా కాకుండా 20 రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలని పేర్కొంది.
ఒకవేళ నిర్దేశించిన పని కన్నా తక్కువగా చేస్తే.. తక్కువ పడే పని విలువలో 50 శాతాన్ని జరిమానా విధించాలని సూచించారు. కానీ.. డిజైన్‌ల ఆమోదం, భూసేకరణ, జలాశయం పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులో ఆలస్యమైతే తమది తప్పు కాదని.. అది సర్కారుదే బాధ్యతని మెలిక పెట్టారు. దీనివల్ల సకాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని.. వడ్డీ భారం తగ్గుతుందని నవయుగ ప్రతిపాదించింది. ఉదాహరణకు ఒక నెలలో రూ.100 కోట్ల విలువైన పని చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశిస్తే.. కాంట్రాక్టర్ రూ.120 కోట్ల విలువైన పని చేస్తే.. అదనంగా చేసిన రూ.20 కోట్ల పనికిగానూ కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు బోనస్‌గా సర్కార్ ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ ఒకవేళ ఆ మేరకు పనులు చేయకపోతే జరిమానా విధించే అవకాశమే ఉండదు. ఎందుకంటే.. డిజైన్‌ల ఆమోదంలోనో, బిల్లుల చెల్లింపులోనో, భూసేకరణలోనో జాప్యాన్ని చూపి కాంట్రాక్టర్ తప్పించుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ కాంట్రాక్టర్‌పై జరిమానా విధించకపోవడమే దీనికి తార్కాణం. కాంట్రాక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయాలని జెన్‌కో అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. జెన్‌కో అధికారులు అంగీకరించని నేపథ్యంలో కేబినెట్ తీర్మానం ద్వారా టెండర్లపై ఆమోదముద్ర వేసి.. కమీషన్లు రాబట్టుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.
ఆర్థిక శాఖ ఆక్షేపణ..
పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదని.. ఇప్పటికిప్పుడు రూ.5,338.95 కోట్లతో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో ఔచిత్యమేమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీల భారం పడుతుందన్న సాకు చూపిస్తూ హైడల్ ప్రాజెక్టు పనులను నవయుగకు అప్పగించేలా టెండర్లను ఖరారు చేసే యత్నాలకు అభ్యంతరం తెలిపింది.
కానీ సీఎం ఇలా అంటున్నారు
పోలవరం జలాశయంలో 31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పాత ధరలకే చేసేందుకు నవయుగ ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అందువల్ల ఆ సంస్థకే కాంక్రీట్ పనులు నామినేషన్‌పై అప్పగిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment